వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో దురదృష్టం వెంటాడింది. అప్పటి వరకు ఒక్క ఓటమి లేకుండా టీమ్‌ని అత్యద్భుతంగా ముందుకు నడిపించిన రోహిత్ శర్మ కప్ మాత్రం అందించలేకపోయాడు. ఫైనల్ లో భారత్ ఓటమి ఖాయమైనప్పుడు రోహిత్‌తో పాటు ఆయన సతీమణి కూడా కన్నీరు పెట్టుకున్నారు. చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వరల్డ్ కప్ ముగిసింది. తర్వాత ఐసీసీ టైటిల్ కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తారు అనే చర్చ మొదలైంది. 2027 ప్రపంచకప్‌కు సన్నాహకాలు కొనసాగే క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా, ఆయన తర్వాత ఎవరు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటారు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో మొదలవుతున్నాయి. రోహిత్ శర్మతో సహా చాలా మంది ఆటగాళ్ళు అధిక వయసు ఉన్నవారు కావడంవతో వచ్చే ప్రపంచకప్‌లో వాళ్లు ఆడటం అసాధ్యం అని చెప్పాలి.
2027 ప్రపంచ కప్‌నకు జట్టును రూపొందించే క్రమంలో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీని నుండి తొలగిస్తే ఆయన తర్వాత కెప్టెన్‌గా ఎవరు కాగలరనే ఊహాగానాలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత టీమ్ ఇండియాను పరిశీలిస్తే, తాజా ముఖాల్లో కెప్టెన్ సామర్థ్యం కూడా ఉన్న శుభమాన్ గిల్ , శ్రేయాస్ అయ్యర్ పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఇద్దరిలో కూడా అయ్యర్‌కే ముందుగా ఈ అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే అతనికి దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం బాగానే ఉంది. వారిద్దరితో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి వారు కెప్టెన్సీ ఆప్షన్‌లో ఉన్నారు.
అయితే ఫిట్‌నెస్, కొన్నిసార్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ఈ ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుందా లేదా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. గిల్,అయ్యర్‌లలో ఒకరు కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటే వారు టీమ్‌ని విజయాల వైపు నడిపిస్తారా లేదా అనే దానిపై కొంత డిస్కషన్ నడుస్తుంది. మరి రానున్న రోజులలో టీమ్ మేనేజ్ మెంట్ ఏ నిర్ణయంతో ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది టీ 20 ప్రపంచ కప్ ఉండగా, అందులో అయిన టీమిండియా సత్తా చాటి నిరాశలో ఉన్న భారత అభిమానులకి సంతోషం పంచాలని కోరుకుంటున్నారు.