నీటిని వృథా చేస్తే.. రూ. 5 వేలు జ‌రిమానా..! ఎక్క‌డంటే..?

క‌ర్ణాట‌క రాష్ట్రంలో తాగునీటి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Publish Date - March 6, 2024 / 03:18 AM IST

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్రంలో తాగునీటి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాట‌ర్ ట్యాంక‌ర్ వ‌చ్చిందంటే చాలు.. జ‌నాలు బిందెల‌తో ఎగ‌బ‌డుతున్నారు. స‌రిప‌డ తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బెంగ‌ళూరు న‌గ‌రంలోని ప‌లు హౌసింగ్ సొసైటీలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. నీటిని వృథా చేయొద్ద‌ని నోటీసు బోర్డుల్లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే నీటి ఎద్ద‌డి తీవ్రంగా ఉంది. రాబోయే రోజుల్లో భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోయే అవ‌కాశం ఉంది. దీంతో నీటిని చూసి వాడుకోవాల‌ని, ఇక నుంచి 20 శాతం నీటి వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని ఆదేశించారు. నీటి వాడ‌కాన్ని త‌గ్గించక‌పోతే రూ. 5 వేలు జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చ‌రించారు. దీన్ని ప‌ర్య‌వేక్షించేందుకు ఓ సెక్యూరిటీ గార్డును కూడా నియ‌మించారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే భారీ జ‌రిమానాలు ఉంటాయ‌ని హౌసింగ్ సొసైటీలు హెచ్చ‌రించాయి.

ప్ర‌స్తుతం బెంగ‌ళూరు వ్యాప్తంగా 16,781 బోర్లు ఉన్న‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. ఇందులో ఇప్ప‌టికే 6,997 బోర్లు ఎండిపోయాయి. 7,784 బోర్లు మాత్ర‌మే ప‌ని చేస్తున్నాయి. ఎండ‌లు ముదిరితే ఈ బోర్ల నుంచి కూడా నీరు రావ‌డం క‌ష్టమ‌ని అధికారులు పేర్కొన్నారు. తాగునీటి ఎద్ద‌డి నేప‌థ్యంలో ప్ర‌జ‌లు నీటి వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని అధికారులు సూచించారు. 

Latest News