బ్లడ్ గ్రూపులు వేరైనా.. విజయవంతంగా కిడ్నీ మార్పిడి..
బ్లడ్ గ్రూపులు వేర్వేరుగా ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సాధ్యమేనని మరోసారి నిరూపించారు వైద్యులు.

న్యూఢిల్లీ : బ్లడ్ గ్రూపులు వేర్వేరుగా ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సాధ్యమేనని మరోసారి నిరూపించారు వైద్యులు. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఈ రకమైన మూత్రపిండాల మార్పిడి జరిగింది. తాజాగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు కూడా బ్లడ్ గ్రూపులు వేర్వేరుగా ఉన్న వ్యక్తుల మధ్య నిర్వహించిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది.
ఢిల్లీకి చెందిన ఓ 43 ఏండ్ల వ్యక్తి గత రెండేండ్ల నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరు నెలల పాటు డయాలసిస్ చేశారు. చివరకు అతనికి మూత్రపిండాల మార్పిడి తప్పనిసరి అయింది. దీంతో ఆ రోగికి కిడ్నీ అవసరం ఏర్పడింది. తన భర్తకు కిడ్నీ దానం చేసేందుకు భార్య ముందుకు వచ్చింది. కానీ ఇద్దరు బ్లడ్ గ్రూపులు వేర్వేరు.
28 ఏండ్ల వయసున్న భార్య బ్లడ్ గ్రూప్ ఏబీ పాజిటివ్ కాగా, భర్త బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్. వేర్వేరు బ్లడ్ గ్రూపుల మధ్య అవయవ మార్పిడి చాలా సంక్లిష్టమైనది. అయినప్పటికీ సఫ్దర్ జంగ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఈ శస్త్ర చికిత్సలో భాగంగా దాత అవయవాన్ని తిరస్కరించే ప్రతిరోధకాలను పూర్తిగా తొలగించారు. ప్లాస్మాఫెరెసిస్ అనే ప్రక్రియ ద్వారా ప్రతిరోధకాలను తటస్తం చేయడానికి మందులు ఇస్తూ రోగిలో ప్రతిరోధకాలను క్రమంగా తగ్గించగలిగినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం కిడ్నీ మార్పిడి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడని, ఎలాంటి సమస్యలు తలెత్తదని వైద్యులు స్పష్టం చేశారు.