వాకింగ్ స్టిక్‌తో నడుస్తున్న స్టార్ క్రికెట‌ర్.. ఇండియాకి ఇది పెద్ద దెబ్బే..!

వాకింగ్ స్టిక్‌తో నడుస్తున్న స్టార్ క్రికెట‌ర్.. ఇండియాకి ఇది పెద్ద దెబ్బే..!

టీమిండియా ఆట‌గాళ్లు గాయ‌ప‌డుతుండ‌డం భార‌త అభిమానుల‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ఇప్ప‌టికే మ‌హ్మ‌ద్ షమీ గాయంతో జ‌ట్టుకి దూరం కాగా, రీసెంట్‌గా రుతురాజ్ కూడా గాయంతో ఇండియాకి వ‌చ్చాడు. ఇక దక్షిణాఫ్రికా టూర్‌లో టీ20 జ‌ట్టుకి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన సూర్య కుమార్ యాద‌వ్ కూడా గాయ‌ప‌డ్డాడు. అత‌ను ప్ర‌స్తుతం ఊత‌క‌ర్ర‌ల సాయంతో న‌డుస్తున్నాడు.సూర్య తన చీలమండ గాయం నుండి కోలుకోవడానికి సుమారు ఆరు నుంచి ఏడు వారాల సమయం ప‌ట్టేలా క‌నిపిస్తుంది. సూర్య గ్రేడ్ 2 గాయం తీవ్రతతో బాధపడుతుండ‌గా, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వచ్చే వారం బెంగళూరులోని NCAకి వెళ్లనున్న‌ట్టుగా తెలుస్తుంది.

అయితే గాయ‌ప‌డిన సూర్య‌… త‌న ఇన్‌స్టాలో ఓ వీడియా షేర్ చేశాడు. అందులో అత‌ను కాలికి ప్లాస్టర్ వేసుకుని వాకింగ్ స్టిక్‌తో న‌డుస్తున్నాడు . ‘గాయాలు ఎప్పుడూ సరదాగా ఉండవని ,అయినప్పటికీ.. వాటిని అధిగ‌మించి నేను ముందుకు నడుస్తాను. త్వరలో పూర్తిగా ఫిట్‌గా ఉంటానని వాగ్దానం చేస్తాను. అప్పటి వరకు, మీరందరూ సెలవు సమయాన్ని ఆస్వాదిస్తున్నారని, ప్రతిరోజూ చిన్న చిన్న ఆనందాలను అనుభవిస్తున్నారని కోరుకుంటున్నానంటూ సూర్య ఒక వీడియో షేర్ చేశాడు. సూర్య షేర్ చేసిన వీడియాలో వెల్‌క‌మ్ సినిమాలోని డైలాగ్ కూడా ప్లే అవుతుండ‌డం విశేషం.

గాయంతో జ‌ట్టుకి దూరంగా ఉంటున్న సూర్య‌కుమార్ యాద‌వ్… జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే 3 టీ20 సిరీస్‌లో సూర్య ఆడే అవకాశం క‌నిపించ‌డం లేదు. జనవరి 11న మొహాలీలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ20 జనవరి 14న ఇండోర్‌లో, మూడో టీ20 బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.దీనికి హార్ధిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం పాండ్యా క్ర‌మంగా కోలుకుంటున్నాడ‌ని, ఆ స‌మ‌యం వ‌ర‌కు జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని కొంద‌రు ప్ర‌తినిధులు చెప్పుకొస్తున్నారు. వ‌న్డే ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లలో సూర్య టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.