PPF Investment | ఇలా చేస్తే నెలకు రూ.99వేలు ట్యాక్స్ ఫ్రీ ఆదాయం.. కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన స్కీమ్!
PPF Investment | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇందులో నెలకు కనీస పెట్టుబడి రూ.500 ఉండగా.. గరిష్టంగా ఏడాదికి రూ.1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ సమయం తర్వాత లక్షల్లో ట్యాక్స్ ఫ్రీ కార్పస్ పొందవచ్చు.
PPF Investment | కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో అద్భుతమైన స్కీమ్ ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (PPF). ఇందులో ప్రతి నెల కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే.. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవచ్చు. అలా ఎంత డబ్బు వచ్చినా సరే దానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. పైగా ఒకేసారి రూ.41 లక్షల ట్యాక్స్ ఫ్రీ కార్పస్ కూడా అందుకోవచ్చు. అలాగే ప్రతి నెల రూ.99,000 ట్యాక్స్ ఫ్రీ ఆదాయం కూడా పొందవచ్చు. దీనికోసం ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ ఆదాయం రావాలంటే ఎంత కాలం పడుతుంది? ఆ లెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పీపీఎఫ్ అంటే ఏంటి?
పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే చిన్న పొదుపు పథకం. దీని మెచ్యూరిటీ సమయం 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును సమీక్షించాల్సి ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ వడ్డీ రేటులో మార్పులు చేయలేదు.
పెట్టుబడి ఎంత పెట్టాలి?
ఈ పీపీఎఫ్‌లో ఏడాదికి కనీస పెట్టుబడి రూ.500గా ఉండగా.. గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో ఈ పీపీఎఫ్ అకౌంట్ తీసుకోవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతా తీసుకోవచ్చు. కేవైసీ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, నామినీ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒకేసారి లేదా నెల నెల విడతలవారీగా డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు.
పన్ను ప్రయోజనాలు
పీపీఎఫ్ కింద పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు డిడక్షన్ పొందవచ్చు. అలాగే పీపీఎఫ్ వడ్డీ మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ. అలాగే మెచ్యూరిటీ అమౌంట్ మొత్తానికి కూడా ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
మెచ్యూరిటీ& ఎక్స్‌టెన్షన్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూరిటీ సమయం 15 సంవత్సరాలు. ఆ గడువు తర్వాత 5 సంవత్సరాల చొప్పున ఎన్నిసార్లు అయినా పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీ సమయానికంటే ముందు కూడా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే పీపీఎఫ్ ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత అందుకు అవకాశం ఉంటుంది. అది కూడా ఏడాదికి ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం అమౌంట్‌లో గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
15 సంవత్సరాల్లో 41 లక్షలు
పీపీఎఫ్ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అంటే నెలకు రూ.12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. 15 సంవత్సరాల్లో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు అవుతుంది. దానిపై చక్రవడ్డీ మొత్తం రూ.18,18,209 వరకు వస్తుంది. అంటే 15 సంవత్సరాల మెచ్యూరిటీ ముగిసిన తర్వాత ఒకేసారి మీ చేతికి రూ.40,68,209 వరకు అందుతుంది. ఈ స్కీమ్ EEE ట్యాక్స్ మినహాయింపు కలిగి ఉంటుంది. అంటే ప్రతి ఏడాది రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చే వడ్డీ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మొత్తం రూ.40,68,209 రూపాయిలు మీ చేతికి వస్తాయి.
20 సంవత్సరాల తర్వాత అయితే!
అదే 15 సంవత్సరాల మెచ్యూరిటీ ముగిసిన తర్వాత ఐదేళ్లకు ఎక్స్‌టెన్షన్ చేశామని అనుకుందాం. అప్పుడు మొత్తం 20 ఏళ్లకు మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ.30 లక్షలు అవుతుంది. దానికి వడ్డీ రూ.36,58,288 వస్తుంది. అంటే మొత్తం రూ.66,58,288 మీ చేతికి అందుతుంది.
ఇంకో ఐదేళ్లు పొడిగిస్తే..!
25 సంవత్సరాల తర్వాత మళ్లీ ఐదేళ్లు పొడిగిస్తే.. అప్పుడు మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ.37.50 లక్షలు అవుతుంది. దానికి వడ్డీ రూ.65,58,015 వస్తుంది. అప్పుడు మొత్తం రూ.1,03,08,015 అవుతుంది
నెలకు 99 వేల ఆదాయం
అదే 31 సంవత్సరాల వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పెట్టుబడి రూ.46.50 లక్షలు అవుతుంది. దానికి చక్రవడ్డీ రూ.1,20,58,575 వస్తుంది. మొత్తం అసలు, వడ్డీ కలిపి మొత్తం కార్పస్ రూ.1,67,08,575 అవుతుంది. అంటే 31 ఏళ్ల తర్వాత మీ వద్ద సుమారు రూ.1.67 కోట్లు ఉంటాయి. అప్పుడు దీనిపై 7.1 శాతం వడ్డీ వస్తే వార్షిక వడ్డీ రూ.13,92,381 అవుతుంది. అంటే నెలకు రూ.99వేలు. ఈ రకంగా ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా ప్రతి నెల రూ.12,500 లేదా ప్రతి ఏడాది రూ.1.5లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 31 ఏళ్ల తర్వాత వడ్డీ రూపంలో నెలకు రూ.99వేలు ఆదాయం పొందవచ్చు. అది కూడా ట్యాక్స్ ఫ్రీ!!
Read More:
Collector Chahat Bajpai | ఆమె కలెక్టర్ అయినా… అమ్మ… అమ్మే! శిశువులతో ఊసులాడి… లాలించి..
NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram