NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు
తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త NH-565 హైవే అందుబాటులోకి వచ్చింది. ప్రయాణ సమయం తగ్గి, నల్గొండ-మార్కాపురం ప్రాంతాలకు భారీ లాభం చేకూరనుంది.
విధాత,: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని నకిరేకల్ నుంచి ఏపీలోని తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వరకు నిర్మించిన జాతీయ రహదారి-565 (NH-565) పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి, రెండు రాష్ట్రాల మధ్య కీలక అనుసంధానకర్తగా నిలవనుంది. ముఖ్యంగా ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65ని.. మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది. దీంతో ఈ మార్గం ప్రయాణికులకు ఎంతో సమయాన్ని ఆదా చేయనుంది.
తిరుపతికి సరికొత్త మార్గం
దాదాపు 420 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మారింది. తెలంగాణలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ మీదుగా సాగే ఈ రహదారి, ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఆ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రావురు, వెంకటగిరి మీదుగా ప్రయాణించి ఏర్పేడు వద్ద ముగుస్తుంది. ఇక్కడ నుంచి ప్రయాణికులు సులభంగా శ్రీకాళహస్తి లేదా తిరుపతికి చేరుకోవచ్చు.
రూ. 393 కోట్లతో అభివృద్ధి..ఆ ప్రాంతాలకు మేలు
జాతీయ రహదారి-565 నిర్మాణం ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులకు ఎంతో ఊరటనిచ్చింది. గతంలో యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే పుల్లలచెరువు, వెల్దుర్తి మండలాల మధ్య ఉన్న అటవీ ప్రాంతం మీదుగా కష్టతరమైన ప్రయాణం సాగించాల్సి వచ్చేంది . ఘాట్ రోడ్డు అధ్వానంగా ఉండటంతో 20 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి దాదాపు 50 నిమిషాలు పట్టేది. అయితే ఇప్పుడు జాతీయ రహదారి-565 నిర్మాణంతో ఆ కష్టాలు తీరిపోయాయి. రూ.393 కోట్ల వ్యయంతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడంతో కేవలం 20 నిమిషాల్లోనే ఆ దూరాన్ని చేరుకోవచ్చు.
ఈ జాతీయ రహదారి మార్గంలో 16 వంతెనలు, 8 అండర్‌పాస్‌లు నిర్మించారు. అటవీ అనుమతుల వంటి అడ్డంకులు ఎదురైనా, పనులను వేగంగా పూర్తిచేసి గడువు కంటే ముందే అందుబాటులోకి తేవడం విశేషం. ఈ మార్గం కడప జిల్లాలోని పోరుమామిళ్ల ప్రాంత ప్రజలు హైదరాబాద్ వెళ్లడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొండలు, లోయల మధ్య నిర్మించిన ఈ రహదారి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది.
మొత్తం 420 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ, కనగల్ ప్రాంతాల మీదుగా వచ్చి, మాచర్ల వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపుకు వెళితే కాళహస్తి, కుడివైపుకు వెళితే తిరుపతిని చేరుకునేలా ఈ మార్గం ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు తిరుపతి వెళ్లడం మరింత సులభం కానుంది.
ఇవి కూడా చదవండి :
Telangana petrol availability| తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత లేదు
Ram Charan | పెద్ది షూటింగ్‌లో అపశృతి.. రామ్ చరణ్‌కి గాయం, టెన్షన్ పడొద్దంటున్న మేకర్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram