AP New Districts List : ఏపీలో 28 జిల్లాలకు కేబినెట్ ఆమోదం

ఏపీలో జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరింది.

AP New Districts List : ఏపీలో 28 జిల్లాలకు కేబినెట్ ఆమోదం

అమరావతి : జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుతో పాటు అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వేకోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపేందుకు, కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 24 అంశాలను క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని..9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో మాత్రం మార్పులు జరిగినట్లు తెలిపారు. మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయని..దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుందని తెలిపారు.

మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కంటతడి

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటిని మదనపల్లి జిల్లాలోకి మార్చవద్దంటూ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై మంత్రివర్గం ముగిశాక చంద్రబాబు స్పందించారు. విధిలేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి పోరాడుతున్నారని, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజంపేట వాసులు కడపను కోరుకుంటున్నారని, రైల్వేకోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నారని సీఎం అన్నారు. రాయచోటి మార్పు తప్పట్లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మార్పు తప్పలేదని వివరించారు. ఆదోని 2 మండలాల ఏర్పాటుపై భేటీలో చర్చ జరిగిందని తెలిపారు. మూడు మండలాల ఏర్పాటుపై చర్చ జరగగా, 2 మండలాలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. నెల్లూరులో రెవెన్యూ డివిజన్‌ ఒక చోట, డీఎస్పీ పరిధి మరో చోట ఉండడంపై చర్చించామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Bhupalpally : విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ ..వీడియో వైరల్
Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డికి 90టీఎంసీలే మా విధానం