Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డికి 90టీఎంసీలే మా విధానం

పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. హరీష్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ అసెంబ్లీలో లెక్కలు తేలుస్తామన్నారు.

Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డికి 90టీఎంసీలే మా విధానం

విధాత, హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90టీఎంసీల కేటాయింపునే మా ప్రభుత్వ విధానమని, మేం 45టీఎంసీలకు ఒప్పుకుంటూ కేంద్రానికి లేఖ రాశామని బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. నీటి లెక్కలన్ని తనకే తెలుసన్నట్లుగా ఇరిగేషన్‌లో తానే మాస్టర్‌ననని హరీష్ రావు అనుకుంటున్నారని విమర్శించారు. హరీశ్‌రావుకు అంత అహంకారం ఎందుకు? అని ప్రశ్నించారు. పదేపదే అబద్దాలు చెబుతూ గోబెల్స్ కు తాతగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి ప్రభుత్వం డిమాండ్ 90 టీఎంసీలే అని, 45 టీఎంసీలు అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ అని వాళ్లు ఇచ్చిన జీవో నే..మేము ప్రస్తావిస్తూ.. లేఖ రాశాం అన్నారు. మొదటగా మా సేవింగ్ ఉన్న.. 45 టీఎంసీ ల మైనర్ ఇరిగేషన్ ను క్లియర్ చేయమని అడిగాం అని స్పష్టం చేశారు. పేజ్ -1 లో ఇనిషియల్ గా చేయమని అడిగాం అన్నారు. బీఆర్ఎస్ నేతలు.. సుప్రీం కోర్టు లో 7 టీఎంసీ లకు ఒప్పుకొని వచ్చారని ఆరోపించారు.

సభలో ఎవరేం చేశారో బయటపెడుతాం

ఎవరి హయాంలో ఏం జరిగిందో అంతా శాసన సభ చర్చలో బయటపెడతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ.. అదే నిజం అవుతుందనుకుంటున్నారని మండిడ్డారు. సీడబ్ల్యూకి రాసిన లేఖలో ఓ పేరాగ్రాఫ్‌ను అవుటాఫ్ కాంటెక్స్ట్‌ తీసుకొస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా తానెందుకు లేఖ రాస్తా? అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో ఒక భాగాన్నే చూపిస్తున్నారని.. కృష్ణా బేసిన్‌పై అసెంబ్లీలో ప్రెజెంటేషన్‌కు తాము సిద్ధమని స్పష్టం చేశారు. మీరు పదేళ్లలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. మేము మాత్రం పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి నీరు అందిస్తాం అన్నారు. మీ చేతకాని తనాన్ని మాపై రుద్దవద్దు అని, మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రానికి పంపడానికి 7 ఏళ్ళు టైం తీసుకున్నారు.
డీపీఆర్ పంపే టైం కు 21 వేల కోట్లు ఖర్చు చేశారు అని, పాలమూరు-రంగా రెడ్డిలో పదేళ్ల కాలంలో 21 వేల కోట్ల పనులు మాత్రమే చేశారని విమర్శించారు. సీడబ్ల్యుసీకి డీపీఆర్ పంపే టైంకు 65 వేల కోట్ల అంచనా పేర్కొన్నారని, మొదట్లో 35 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారం నుంచి దిగి పోయే టైం కు 27 వేల కోట్లు ఖర్చు చేశారు. 65 వేల కోట్లకు 27 మాత్రమే ఖర్చు చేశారని ఉత్తమ్ వెల్లడించారు. ఆయకట్టు కాల్వలకు భూసేకరణ చేయాలంటే మొత్తం కలిపి 70 వేల కోట్లు అవుతుందన్నారు. 35 శాతం ఖర్చు చేసి.. 80 శాతం చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. మేము రెండేళ్లలో 7 వేల కోట్లు ఖర్చు చేశాం అని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కటే పంపు పెడితే.. మేము వచ్చాక 11 మోటర్లు పెట్టాం అని వెల్లడించారు.

కాళేశ్వరానికి లక్ష కోట్లు..పెండింగ్ పాలమూరుకు 27వేలు కోట్లా?

పెండింగ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు రూ.27 వేల కోట్లు.. కొత్త కాళేశ్వరంకు లక్ష కోట్లు ఖర్చు చేశారని..మీకు పాలమూరు మీద ఎందుకు అంత వివక్ష అని ఉత్తమ్ బీఆర్ఎస్ ను నిలదీశారు. పాలమూరు-రంగా రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును రెండు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి కుదించారు అని, కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీల నుంచి.. మూడు టీఎంసీలకు పెంచారు అని ఉత్తమ్ తెలిపారు. సీఈ విజయ్ భాస్కర్ రెడ్డికి స్వయంగా..పాలమూరు పనులు స్లో చేయాలని చెప్పారని ఉత్తమ్ ఆరోపించారు. ఇరిగేషన్ మీద 1.83 లక్షల కోట్లు ఖర్చు చేశారు. కానీ పాలమూరులోని పెండింగ్ లో ఉన్న నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా లో 299 టీఎంసీ లకు కట్టుబడి ఉంటామని ఆపేక్స్ కౌన్సిల్ లో ఒప్పుకున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లపూర్, ఎదుల లింక్ పనులు కూడా ఆపేశారని ఉత్తమ్ ఆరోపించారు. 2 వేల కోట్ల తో ఖర్చు చేస్తే పూర్తి అయ్యే ఎస్ఎల్బీసీ విషయంలోనూ నిర్లక్ష్యం చేశారు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేసి.. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు కు మాత్రం మొండి చేయి చూపారు అని, కల్వకుర్తి 900 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యేదని.. కానీ చేయలేదు అని విమర్శించారు.

మేడిగడ్డ పునర్నిర్మాణంపై ఎల్ ఆండ్ టీ సంస్థకు నోటీసులు ఇచ్చాం అని, పలు టెస్టులు, ఇతర అంశాలకు సంస్థ ఒప్పుకుందని, త్వరలోనే పనులు మొదలు అవుతాయని తెలిపారు. మేడిగడ్డ పునర్నిర్మాణం పనులకు డెడ్‌లైన్ పెట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Krishna Water Dispute : బిగ్ టాపిక్..కృష్ణా బేసిన్‌లో 45 టీఎంసీల నీటిపై పొలిటికల్ వార్
Padi Kaushik Reddy : తొలి రోజునే రభసా..ముందంతా రచ్చరచ్చనే