ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే 25వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించింది.

ఈనెల15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
నిర్ణయించిన ఏపీ కేబినెట్
విధాత, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే 25వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అమరావతిలో సమావేశమైన మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది. నూతన బార్ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్ మొత్తం 12 అంశాలను ఆమోదించింది. నాయి బ్రాహ్మణలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం తె లిపింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 ఏపీటీడీసీ హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది.
తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపు రద్దు చేయాలని నిర్ణయించింది. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఐఐసీకి రూ. 7500 కోట్ల రుణం తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మావోయిస్ట్ పార్టీ, ఆర్ డీ ఎఫ్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం విధించడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.