అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో బంగారం ధరలు తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. మరోసారి బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేయగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 930 పెరిగి రూ. 1,45,860 కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 850 పెరిగి రూ. 1,33,700వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం రూ. 2,44,000 వద్ద నిలకడగా కొననసాగుతుంది.
కొద్దికొద్దిగా కొనుగోలు మంచిదే…
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక, భౌగోళిక పరిణమాల మధ్య భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2025ఏప్రిల్ నెలలో తులం బంగారం రూ. 1లక్ష 10వేలుగా ఉంది. ఆ తర్వాతా ఈ ఏడాది రూ.2లక్షల ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. తిరిగి పశ్చిమాసియా సంక్షోభంతో పసిడి ధరలు పడిపోయాయి. కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, డాలర్ విలువ, ఫెడర్ రిజర్వ్ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్భణం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో 2026లో 10 గ్రాముల బంగారం ధరలు రూ. 1.4 లక్షల నుంచి రూ. 1.5 లక్షల పైన ఉండే అవకాశం ఉంది. స్వల్పకాలంలో 5 శాతం నుండి 15 శాతం వరకు ధరలు తగ్గడం సహజమైన విషయమే కానీ.. దానిని పెద్ద పతనంగా భావించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో బంగారం ధరలు 10 శాతం నుండి 20 శాతం వరకు తగ్గడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. అందువల్ల ధరలు తిరిగి రూ. 1. 10 లక్షలకు తగ్గుతాయని ఆశించి కొనుగోళ్లను పూర్తిగా వాయిదా వేయడం సరైన నిర్ణయం కాకపోవచ్చు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయకుండా మార్కెట్ ను పరిశీలిస్తూ.. క్రమపద్ధతిలో కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు.
