Mercedes Benz CLA EV | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సరికొత్త CLA ఎలక్ట్రిక్ కారును అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక మెర్సిడెస్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్ (MMA) ప్లాట్‌పామ్‌పై రూపొందిన తొలి మోడల్ ఇదే కావడం గమనార్హం. భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫ్లాట్‌ఫామ్ మెరుగైన పనితీరు, అధునాత సాఫ్ట్‌వేర్ ఫీచర్లను అందిస్తుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ప్రారంభ ధరను రూ.55లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు. ఇక టాప్ వేరియంట్ ధర రూ.64 లక్షల వరకు ఉంది. కాగా, అధికారిక ప్రకటనకు ముందే 400కు పైగా బుకింగ్స్ రావడం విశేషం.
మూడు వేరియంట్లలో అందుబాటులోకి!
మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ కారు మూడు విభిన్న వేరియంట్లలో వస్తుంది. బడ్జెట్ లగ్జరీ కోరుకునే వారికోసం CLA 200 స్టాండర్డ్ రేంజ్, అధిక మైలేజ్ రేంజ్ కోరుకునే వారికోసం CLA 250+ లాంగ్ రేంజ్, స్పెషల్ ఫీచర్లు, అదనపు హంగులు కోరుకునే వారికోసం CLA 250+ లాంచ్ ఎడిషన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రేంజ్ ఎంతంటే..!
* CLA 250+ Long Range, Launch Edition మోడళ్లలో 200kW(268hp) ఎలక్ట్రిక్ మోటార్ ఉండగా.. ఇది 335nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ జీరో నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 6.7 సెకన్లలోనే అందుకుంటుంది. ఇది గరిష్ఠంగా 210kmph వేగంతో వెళ్తుంది.
* CLA 200 Standard Range మోడల్‌లో 165kW (221hp) మోటార్ ఉండగా.. ఇది జీరో నుంచి 100 కి.మీ. వేగాన్ని 7.5 సెకన్లలో చేరుకుంటుంది.
రేంజ్ విషయానికొస్తే CLA 250+ వేరియంట్లు WLTP ప్రమాణాల ప్రకారం.. గరిష్టంగా 792కి.మీ. వరకు ప్రయాణిస్తాయి. అంటే ఒక్కసారి చార్జింగ్ చేస్తే హైదరాబాద్ నుంచి ముంబై కానీ.. బెంగళూరు కానీ నాన్‌స్టాప్‌గా వెళ్లిపోవచ్చు. అదే CLA 200 Standard Range మోడల్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 542కి.మీ. వెళ్లొచ్చు.
240kW DC ఫాస్ట్ చార్జర్ ద్వారా Long Range వేరియంట్లను కేవలం 20 నిమిషాలు చార్జ్ చేస్తే 400 కి.మీ. వరకు వెళ్లొచ్చు. అదే CLA 200 స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ అయితే 320కి.మీ. వెళ్లొచ్చు.
స్పోర్టీ డిజైన్ – అత్యాధునిక ఫీచర్లు
డిజైన్‌పరంగా ఈ కారును స్పోర్టీ కూపే స్టైల్‌లో రూపొందించారు. స్లోపింగ్ రూఫ్‌లైన్, స్టార్ ప్యాటర్న్‌తో ఇల్యూమినేటెడ్ గ్రిల్, పూర్తి వెడల్పు ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్, 19 అంగుళాల వీల్స్ ఇందులో ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. MBUX Superscreen, పనోరమిక్ సన్‌రూఫ్, ChatGPT-4, మైక్రోసాఫ్ట్ బింగ్, జెమిని ఆధారిత వర్చువల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్ ఈవీ రూట్ ప్లానింగ్ ఫీచర్లు ఉన్నాయి.
వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..
CLA 200 Standard Range ధర రూ.55లక్షలు
CLA 250+ Long Range ధర రూ.59లక్షలు
CLA 250+ Launch Edition ధర రూ.64లక్షలు
భారత్‌లో మెర్సిడెస్‌కు చెందిన MB.CHARGE Public నెట్‌వర్క్ ద్వారా 9వేలకు పైగా చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల చివరలో CLA 250+ లాంగ్ రేంజ్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. జూన్ నుంచి CLA 200 స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ డెలివరీలు ప్రారంభమవుతాయి.
Read More:
350cc ఇంజిన్‌తో డ్యూక్ బైక్‌లు లాంఛ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
సింగిల్ చార్జింగ్‌తో 320 కి.మీ. వెళ్లొచ్చు.. ఓలా నుంచి మరో బైక్ రిలీజ్!
