Toyota Urban Cruiser EBella | ఎట్టకేలకు టయోటా కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. తమ కంపెనీ నుంచి తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Toyota Urban Cruiser Ebella E3 వేరియంట్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ.23.60 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. అయితే ఇది టాప్ స్పెక్ మోడల్ ధర మాత్రమే. దిగువ శ్రేణి వేరియంట్లు అయిన E1, E2 ధరలను ఇంకా వెల్లడించలేదు.
ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎస్‌యూవీ టయోటా భాగస్వామ్య సంస్థ అయిన మారుతి సుజుకీ ఈ విటారా ఆధారంగా రూపొందించిన రీబ్యాడ్జ్ వెర్షన్. అయినప్పటికీ డిజైన్, ఫీచర్ల పరంగా ఈ కారుకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికి టయోటా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఈ-విటారా కంటే తక్కువ ధరలోనే దీన్ని తీసుకొచ్చింది. ఈ విటారా ఆల్ఫా వేరియంట్ ధర కంటే కూడా దీని ధర సుమారు 3.6లక్షలకు తక్కువకే లాంచ్ చేసింది.
ఈ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా E3లో 61kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అందిచంచారు. దీనికి ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను జోడించారు. ఇది 128kW (సుమారు 174bhp) శక్తి, 189 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ కారును పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని టయోటా కంపెనీ తెలిపింది. అంటే దాదాపుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్లి రావచ్చన్నమాట.!
చార్జింగ్ విషయానికి వస్తే 7kW AC చార్జర్‌తో సుమారు 9 గంటల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు. అదే 11kW AC చార్జర్‌తో 5.5 గంటల్లోనే పూర్తి చార్జ్ అవుతుందని టయోటా కంపెనీ తెలిపింది. డీసీ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో కేవలం 45 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ చార్జ్ చేయవచ్చని పేర్కొంది. ఇక మోటార్, ఇన్వర్టర్, ట్రాన్స్‌మిషన్‌ను ఒకే యూనిట్‌గా కలిపిన కాంపాక్ట్ 3 ఇన్ 1 ఎలక్ట్రిక్ డ్రైవ్ డ్రైన్‌ను అందించారు.
ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా డిజైన్ పరంగా మారుతి సుజుకీ ఈ విటారా ఆకృతిని పోలి ఉన్నప్పటికీ.. హ్యామర్‌హెడ్ స్టైల్ ఫ్రంట్ ఫేసియా, గ్లోస్ బ్లాక్ క్లోజ్‌డ్ గ్రిల్, సన్నటి LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మస్క్యులర్ బంపర్ డిజైన్‌తో ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇక ఇందులో ఏరోడైనమిక్ బాడీలైన్స్, బ్లాక్ క్లాడింగ్, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, 18 అంగుళాల అలాయ్‌వీల్స్‌ను కూడా అందించింది.
ఇంటీరియర్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ టాన్ డ్యూయల్ టోన్ థీమ్‌తో పాటు గ్లోస్ బ్లాక్ ఇన్‌సర్ట్స్, లేయర్డ్ డ్యాష్‌బోర్డును అందించారు. అలాగే క్యాబిన్‌లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్టు ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12 రంగుల అంబియట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్‌రూఫ్, స్లైడింగ్, రీక్లైనింగ్ రియర్ సీట్లు, జేబీఎల్ ప్రీమిం ఆడియో సిస్టమ్, 10 వే ఎలక్ట్రిక్‌గా సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీటు వంటి ప్రీమియం ఫీచర్లను జోడించింది.
భద్రతాపరంగా ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్2 ADAS ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS with EBD, టైర్‌ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను అందించారు. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఇక ఈ ఎస్‌యూవీకి 8ఏళ్ల బ్యాటరీ వారంటీని అందించింది. బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ (BaaS) కింద మూడేళ్ల తర్వాత 60 శాతం బైబ్యాక్ హామీ, ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా అందిస్తోంది.
భారత మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ ZS EV, మహీంద్రా BE6, ఎంజీ విండ్సర్ EV, మారుతి ఈ విటారా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
