TVS Maxi Scooter | ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌‌లో టీవీఎస్ దూకుడు.. త్వరలోనే160సీసీ మ్యాక్సీ స్కూటర్ రిలీజ్!

TVS Maxi Scooter | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కొత్త 160 సీసీ మ్యాక్సీ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త మోడల్‌ను వచ్చే ఏడాది నాటికి మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

TVS Maxi Scooter | ఇటీవల కాలంలో భారత ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ప్రీమియం స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు స్కూటర్ అంటే ఫ్యామిలీకి మాత్రమే అని ఉండగా.. ఇప్పుడు అవి కూడా రూపు మార్చుకుని అధిక పనితీరు, లాంగ్ రైడింగ్ సామర్థ్యం కలిగిన మ్యాక్సీ స్కూటర్లుగా వస్తున్నాయి. వీటికి యువతలోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కొత్త 160 సీసీ మ్యాక్సీ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త మోడల్‌ను వచ్చే ఏడాది నాటికి మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత మార్కెట్‌లో యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి ప్రీమియం స్కూటర్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. త్వరలో హోండా కంపెనీ కూడా ADV160 మోడల్‌‌ను తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ కూడా అదే విభాగంలో బలమైన పోటీదారుగా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల టీవీఎస్ ఎన్‌టార్క్150ను పరిచయం చేసినప్పటికీ.. రానున్న 160 సీసీ మ్యాక్సీ స్కూటర్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ స్కూటర్‌లో కొత్త లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. టీవీఎస్ స్కూటర్ల శ్రేణిలో ఇది అత్యంత ఆధునిక ఇంజిన్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ మ్యాక్సీ స్కూటర్ అధికారిక సాంకేతిక వివరాలను ఇంకా టీవీఎస్ మోటార్స్ వెల్లడించలేదు. అయితే యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 మోడళ్లు సుమారు 14 నుంచి 15 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. టీవీఎస్ కూడా ఇదే స్థాయి పనితీరును లక్ష్యంగా పెట్టుకుని పనిచేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల నగర ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు కూడా ఈ స్కూటర్ అనుకూలంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

డిజైన్‌పరంగా టీవీఎస్ మోటార్స్ ఎలాంటి దిశలో ముందుకెళ్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. యమహా ఏరోక్స్ తరహాలో స్పోర్టీ డిజైన్‌ను ఎంచుకుంటుందా? లేక హీరో జూమ్ 160, హోండా ADV 160 మాదిరిగా అడ్వెంచర్ స్టైల్ లుక్‌ను అందిస్తుందా అనే చర్చ ఆటోమొబైల్ వర్గాల్లో సాగుతోంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ స్కూటర్‌లో 14 అంగుళాల పెద్ద వీల్స్, మెరుగైన విండ్ ప్రొటెక్షన్, సౌకర్యవంతమైన సీటింగ్ అమరికలు ఉండే అవకాశం ఉంది. పొడవైన వీల్‌బేస్ కారణంగా స్థిరత్వం పెరగడంతో పాటు నగర ట్రాఫిక్‌లోనూ, దీర్ఘ ప్రయాణాల్లోనూ మెరుగైన అనుభవాన్ని అందించవచ్చని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

టెక్నాలజీ విషయంలో కూడా టీవీఎస్ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై నావిగేషన్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదనంగా పెద్ద అండర్‌సీట్ స్టోరేజ్, డిస్క్ బ్రేక్‌లు, ప్రీమియం క్వాలిటీ పరికరాలను కూడా అందించే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 

Latest News