Interest Rates | రెండో త్రైమాసికంలో చిన్నమొత్తాలపై వడ్డీ రేట్లు యథాతధం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఆర్థికశాఖ

Interest Rates | 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రస్తుతం యథాతధంగా కొనసాగించబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

  • Publish Date - June 29, 2024 / 10:23 AM IST

Interest Rates | 2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రస్తుతం యథాతధంగా కొనసాగించబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న వడ్డీ రేట్లు జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌ మేరకు.. సుకన్య సమృద్ధి పథకం కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండనున్నది. ఇక పాపులర్ పీపీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ల స్కీమ్ వడ్డీ రేట్లు 7.1 శాతం, 4 శాతంగా కొనసాగుతాయి. కిసాన్ వికాస్ పత్రంపై వడ్డీ రేటు 7.5 శాతం.. అలాగే, పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూరిటీ కానున్నాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)పై వడ్డీ రేటు 2024 జూలై – సెప్టెంబర్ కాలానికి 7.7 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇన్వెస్టర్లకు 7.4 శాతం రాబడిని అందించనున్నది. ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకులు నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతి మూడునెలలకోసారి ఆర్థికశాఖ నోటిఫై చేస్తూ వస్తుంది. తాజాగా మూడునెలల వరకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వడ్డీ రేట్లను యథాతధంగా కొనసాగించనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. జాతీయ పింఛన్‌ పథకం (NPS) చందాదారులకు జూలై ఒకటి నుంచి నుంచి టీప్లస్‌ జీరో సెటిల్‌మెంట్‌ విధానాన్ని (అదే రోజు చెల్లింపు) అమలు చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అనుమతి ఇచ్చింది. ఏ సెటిల్‌మెంట్‌ రోజైనా ట్రస్టీ బ్యాంక్‌కు ఉదయం 11 గంటల వరకు చేరిన ఎన్‌పీఎస్‌ చందాను అదే రోజు మదుపు చేయనున్నారు. చందాదార్లకు అదే రోజు ఉన్న ఎన్‌ఏవీ ప్రయోజనం లభించనున్నదని పీఎఫ్‌ఆర్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

Latest News