ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదుల హతం

- ఫిబ్రవరిలో కశ్మీరీ పండిట్ శర్మను
- చంపిన కేసులో వీరిద్దరు నిందితులు
విధాత: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా అల్షిపోరా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో తాజా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల హస్తం ఉందని పేర్కొన్నారు.
కాగా.. మృతులను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన మోరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూఖ్, అలియాస్ అబ్రార్ గా గుర్తించారు. ఈ విషయాన్నికశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఫిబ్రవరిలో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అచన్ ప్రాంతంలో కశ్మీరీ పండిట్, బ్యాంక్ సెక్యూరిటీ గార్డు అయిన సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చి చంపారు. స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన శర్మను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.