ప్రాణాలు కాపాడుకునేందుకు.. 4వ‌ అంత‌స్థు నుంచి దూకిన యువ‌కుడు

  • By: Somu    crime    Oct 18, 2023 11:59 AM IST
ప్రాణాలు కాపాడుకునేందుకు.. 4వ‌ అంత‌స్థు నుంచి దూకిన యువ‌కుడు
  • బెంగ‌ళూరులో క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లో మంట‌లు
  • తీవ్ర గాయాల‌తో ద‌వాఖాన‌లో చికిత్స‌



విధాత‌: బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని తావరేకెరె మెయిన్‌ రోడ్డులోని ఓ వాణిజ్య భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించింది. త‌ర్వాత భ‌వ‌నం మొత్తం మంట‌లు వ్యాపించాయి. మంట‌ల నుంచి ప్రాణాల‌ను ర‌క్షించుకునేందుకు నాలుగో అంత‌స్థు నుంచి ఓ యువ‌కుడు దూకాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డిని స్థానికులు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.


కోరమంగళ ప్రాంతంలోని తావరేకెరె మెయిన్‌ రోడ్డులోని ఓ భవనంలోని నాలుగో అంత‌స్థులో ఉన్న హుక్కా పార్లర్ అయిన మడ్‌పైప్ కేఫ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, వెంటనే ప్రజలందరినీ సురక్షితంగా తరలించామ‌ని పేర్కొన్నారు. ఇద్ద‌రు గాయ‌ప‌డిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.


కింది అంతస్తులో పార్క్ చేసిన రెండు బైక్‌లు, భవనం సమీపంలోని షోరూమ్‌లోని ఒక కారు మంటల్లో కాలిపోయాయ‌ని చెప్పారు. ప్ర‌స్త‌తుం మంటలను ఆర్పివేసినట్టు వెల్ల‌డించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి భవనంలోని నాలుగో అంతస్థు నుంచి దూకుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


నేను పేలుడు శబ్దం విన్నాను. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ ఘటనను వీడియో తీశారు’ అని ప్రత్యక్ష సాక్షి రాజ్‌కుమార్‌ తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో లోపల పెద్దగా ప్ర‌జ‌లు ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండ‌వ‌చ్చ‌ని, అయితే ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.