Ugadi Rasi Phalau 2025 | ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం – 08, వ్యయం – 14, రాజ పూజ్యం – 07, అవమానం – 05
పూర్వ పద్దతి లో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “5”. ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఏర్పడు వ్యక్తిగత జీవన సమస్యలను సూచించుచున్నది.
ఏప్రిల్ 2025
ఈ మాసంలో ఆరోగ్య మందగమనం ఆందోళన కలిగించును. తృతీయ వారం నుండి ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవన విధానంలో మార్పులు ఏర్పడును. కుటుంబ వ్యవహారాలు చికాకులు కలిగించును. కుటుంబ సభ్యులు మీ సలహాలు పాటించరు. నూతన గృహ నిర్మాణ విషయాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారం అగును. నూతన ఉద్యోగ అవకాశములు లభించును. స్థిరచిత్తంతో పనిచేయుదురు. కీర్తి లభిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకొంటారు. 22, 23, 24 తేదీలలో వృధా వ్యయం పొందుతారు.
మే 2025
ఈ మాసంలో కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించును. ధన ఆదాయం సామాన్యం. ప్రధమ వారంలో విమర్శలు ఎదుర్కొందురు. శుభకార్య సంబంధ విషయాల వలన వ్యయం అంచనాలను మించుతుంది. ఖర్చుపై నియంత్రణ అవసరం. వ్యాపార వర్గం వారు ఆకస్మిక ధననష్టం కలుగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు విజయవంతం అగును. లక్ష్యాలను చక్కగా పూర్తీ చేయగలరు. సంతానానికి ఉత్తమ జీవితం లభిస్తుంది. స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయి. సోదర వర్గం వలన లాభం. కళత్ర విషయాలు కొంత ప్రతికూలత ఎదుర్కొనును.
జూన్ 2025
ఈ మాసంలో ప్రారంభం నుండి ప్రతీ కార్యం ఇబ్బందులను ఎదుర్కొనును. సమస్యలతో పనులు కొనసాగును. ధనాదాయం సామాన్యం. బంధు వివాదాలు, నూతన పరిచయాల వలన నష్టం ఎదురగును. ముఖ్యంగా పితృ వర్గీయులతో మాట్లాడునపుడు జాగ్రత్త అవసరం. 10వ తేదీ తదుపరి వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురిచేయు సంఘటనలు ఎదుర్కొందురు. భవిష్యత్ గురించిన ఆలోచనలు చేయాలి. అతి ధైర్యం పనికిరాదు. పనులు వాయిదా వేయకండి. పట్టుదల ప్రదర్శించాలి. స్థిరాస్తి వ్యవహారాలకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ఈ మాసంలో 6, 7, 11, 13 తేదీలలో ఇబ్బందులు అధికమగును.
జూలై 2025
ఈ మాసంలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ధనాదాయం పెరుగును. ఋణ బాధలు తగ్గును. విద్యార్ధులకు చక్కటి అనుకూల కాలం. విదేశీ విశ్వ విద్యాలయ ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. సరైన ప్రణాళికల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిన్చుకొందురు. సంతాన ప్రయత్నాలు ఫలించవు. వివాహ ప్రయత్నాలలో ఓర్పు అవసరం.
ఆగష్టు 2025
ఈ మాసంలో శత్రు విజయాలు లభిస్తాయి. దగ్గర వారి ప్రమేయంతో సమస్యలకు పరిష్కారం పొందుతారు. నూతన వస్తువులు అమరుతాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహరాదులు సామాన్యం. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవనంలో పాప ఖర్మలు చేయుదురు. పాప-పుణ్య విచక్షణ అవసరమగును. ఆకస్మిక ప్రయాణ లాభాలున్నాయి. ఆరోగ్య విషయాలు క్రమ క్రమంగా మేరుగవును. విదేశీ నివాస సంబంధ వ్యవహారాలలో శుభవార్త.
సెప్టెంబర్ 2025
ఈ మాసంలో సంతాన లేమి దంపతుల సంతాన కోరిక నెరవేరును. వ్యాపారాల వలన లాభకర పరిస్థితి. పితృ వర్గం వార్కి మంచిది కాదు. జీవితంపై ఆలోచనా దృక్పధం మారుతుంది. వైవాహిక జీవనంలో సమస్యలు తొలగును. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉదార స్వభావం వలన పేరు లభిస్తుంది. చంచల స్వభావ మిత్రువర్గం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడును. వీరి వలన చేతికి వచ్చిన ఒక ఫలితమును పోగొట్టుకుంటారు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. చివరి వారంలో మాట తగాదాల వలన దూరమైనవారు తిరిగి దగ్గరవుతారు.
అక్టోబర్ 2025
ఈ మాసంలో వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటారు. ఆర్ధికంగా ధనాదాయం తగ్గుతుంది. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ఇబ్బందుల వలన ఋణ బాధలు ఎదుర్కొంటారు. వాహన సంబంధిత సమస్యలు. వృత్తి జీవనం లోని వారికి అవమానకరమైన పరిస్థితులు. అకాల భోజనం వలన సమస్యలు. ఈ మాసంలో ప్రయత్నాలు కలసి రావు. ఈ మాసంలో 2, 5, 9, 10, 11, 20, 21, 27, 28, 29 తేదీలలో ఇబ్బందులు అధికమగును.
నవంబర్ 2025
ఈ మాసంలో కూడా ఆర్ధిక ఇబ్బందులు కొనసాగును. ఆర్ధికంగా ఒత్తిడి అధికం అగును. కుటుంబ ఖర్చులు కూడా చికాకులు కలుగచేస్తాయి. వ్యాపార లావాదేవీలు సమస్యలతో కొనసాగును. అఖస్మిక వ్యవహార నష్టం. వైవాహిక జీవనంలో పట్టుదల వలన వ్యవహారాలు సమస్యల పాలగును. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ విషయాల వలన అశాంతి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో నమ్మక ద్రోహం. ప్రతీ విషయంలో నిగ్రహం ప్రదర్శించాలి. గొడవలకు అవకాశం ఇవ్వకండి. భవిష్యత్ పై నమ్మకం, ఆశావాదం ఉండాలి.
డిసెంబర్ 2025
ఈ మాసంలో సమస్యలు తగ్గుముఖం పట్టును. ఆర్ధికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ధన వ్యయం తగ్గును. సమస్యలకు కారణమును గుర్తించగలరు. గృహంలో వాస్తు సంబంధ మార్పులు చేయుదురు. సోదర వర్గం వలన సహకారం పొందుతారు. నూతన ఆలోచనలు క్రమేపి కార్యరూపం పొందుతాయి. క్రమక్రమంగా మానసిక అశాంతి తగ్గుతుంది. మనోభీతి తగ్గును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడును. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పట్టుదలతో పరిష్కార సాఫల్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు కలసి వచ్చును. 26, 27, 28 తేదీలలో వివాహ ప్రయత్నాలు చేయండి. విజయవంతం అవుతాయి.
జనవరి 2026
ఈ మాసంలో దూర ప్రాంత జీవనాన్ని ఆశించువారికి విజయం లభించును. వ్యాపారాదులు, ఉద్యోగ జీవనంలో సమస్యలు తగ్గును. అధికారుల సహకారం లభిస్తుంది. లక్ష్యాలను పూర్తీ చేయగలుగుతారు. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. ఆత్మీయుల రాక వలన గృహంలో ఆనందకర సమయం. విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో చికాకులు తొలగుతాయి. శుభకార్యా ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానం వలన మానసిక ఆనందం పొందుతారు. తృతీయ , చతుర్ధ వారాలలో అనారోగ్య సమస్యల వలన చికాకులు.
ఫిబ్రవరి 2026
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. నూతన ఆలోచనలను తిరిగి కార్యాచరణలో పెట్టాలని చూస్తారు. కోర్టు లావాదేవీలు, మిత్ర వర్గ తగాదాలు పరిష్కారం పొందుతాయి. దైవ కార్యములందు ఆసక్తి ఏర్పడును. వ్యాపార విస్తరణ పనులు పూర్తిచెయగలరు. పెట్టుబడులు లభిస్తాయి. సకాలంలో పనులు పూర్తగుట వలన ఒత్తడి తగ్గుతుంది. దాంపత్య సుఖం పొందుతారు. కుటుంబ అంతర్గత సమస్యలను వివేకంతో పరిష్కరిస్తారు. స్వ ఆరోగ్య విషయాలలో ఉదర సంబంధ సమస్యలు చికాకులు కలిగించు సూచన.
మార్చి 2026
ఈ నెలలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషకర సంఘటనలు. బంధువులు మిత్రుల వలన సహకారములు లభించును. ఆశించిన కార్యములందు విజయం. శుభకార్య సంబంధ శ్రమ అధికం అగును. 20వ తేదీ తదుపరి జీవిత భాగస్వామి సహాయ సహకారములు సంపూర్ణంగా లభిస్తాయి. సంతాన ప్రయత్నాలలో విజయం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. ఈ నెలలో 3,8,9,16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. 24వ తేదీ తదుపరి కష్టంతో కార్యములు పూర్తి అగును. కొద్దిపాటి ఒత్తిడి ఎదుర్కొంటారు. అంతరాత్మ ప్రభోదించిన మాటను వినడం మంచిది.