Tulasi Plant | హిందూ కుటుంబాల్లో చాలా మంది తులసి మొక్కను ఎంతో ఆధ్యాత్మికతతో చూస్తారు. ఇంటి ముందు తులసి మొక్కను ఏర్పాటు చేసుకుని ఉదయం, సాయంత్రం వేళ దీపారాధన చేస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే తులసి మొక్క కొన్ని సార్లు ఎండిపోతుంది. అలా తులసి మొక్క ఎండిపోతే అశుభం జరిగే అవకాశం ఉంటుందని చాలా మంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. తులసి ఎండిపోతే నిజంగానే అశుభం జరుగుతుందా..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
చాలా మంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంటి ఆవరణలో లేదా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్కలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఉదయం, సాయంత్రం సమయాల్లో పూజలు చేస్తుంటారు. హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత కలిగిన తులసి మొక్కను ఎంతో భక్తిశ్రద్ధలతో చూస్తుంటారు. అయితే ఉన్నట్టుండి తులసి మొక్క ఎండిపోతుంది. దీంతో తమకు ఏదో కీడు, అశుభం జరిగే అవకాశం ఉందని గృహిణులు ఆందోళన చెందుతుంటారు. ఇది ఎంత వరకు వాస్తవమో తెలుసుకుందాం.
ఇది కేవలం అపోహ మాత్రమేనా..?
ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతే ఎలాంటి అశుభం జరగదు. అది కేవలం అపోహ మాత్రమే అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తులసి మొక్క కుండీలో ఏర్పాటు చేసిన మట్టిలో దోషం ఉండటం, ఎండ సరిగ్గా పడకపోవడం, మొక్కకు సరిపడా నీళ్లు పోయకపోవడం, ఆ కుండీలో ఇతర మొక్కలు పెరగడం, బట్టలు ఆరేసిన నీళ్లు పడటం.. ఇలా మొక్క వాడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని చెబుతున్నారు. అవన్నీ గమనించుకుని జాగ్రత్తలు తీసుకుంటే, తులసి మొక్క గుబురుగానే పెరుగుతుందని సూచిస్తున్నారు. లేదంటే కుండీ చివరన చిన్న మనీప్లాంట్ కొమ్మను నాటితే, అది మట్టిలోని దోషాన్ని స్వీకరిస్తుంది. దాంతో తులసిమొక్క ఎండిపోకుండా ఉంటుందని చెబుతున్నారు.
ఇంట్లో తులసి మొక్క ఏ దిశలో ఉంటే మంచిది..?
చాలా మంది తులసి మొక్కను ఇంటి ప్రధాన తలుపులకు ఎదురుగా ఏర్పాటు చేసుకుంటారు. ఇల్లు తలుపులు తెరవగానే తులసి మొక్కను చూడాలనుకుంటారు. ఇలా చూడడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం. ఒక వేళ ఇంటికి ఎదురుగా తులసి పెట్టే అవకాశం లేకపోతే.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎడమ వైపు కనిపించేలా పెట్టడం ఉత్తమం. ఇలా కూడా వీలు కానప్పుడు తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం ఇలా ఇంటికి ఎనిమిది దిక్కులా ఎక్కడైనా ఆ కుండీని లేదా కోటను ఏర్పాటు చేసుకున్నా తప్పులేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇకపోతే అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లు బాల్కనీ తూర్పు వైపు ఉంటే నైరుతి దిక్కులో, పడమర వైపు ఉంటే వాయవ్య దిశలో తులసికుండీని ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.