Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మరకవిళక్కు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. రోజుకు గరిష్ఠంగా 80వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలోనూ భక్తులు తమ ప్రయాణ మార్గాన్ని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. కేరళ సీఎం పినరయి విజయ్ అధ్యక్షతన తీర్థయాత్రలకు సంబంధించిన సన్నాహాలపై సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు సమావేశం నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి సైతం మకరవిళక్కు సమయంలో పెద్ద ఎత్తున దీక్షాపరులు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు సైతం అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పార్కింగ్‌పై దృష్టి సారించామని.. సమస్యలు లేకుండా చూడనున్నట్లు చెప్పారు. శబరిమల మార్గంలో రోడ్లు, చుట్టూ పార్కింగ్ నిర్వహణకు సంబంధించిన పనులు త్వరలోనే పూర్తి కానున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించి ఓ అతిథిగృహం నిర్మాణం పూర్తయ్యిందని.. మరొకటి పూర్తి కానున్నదని అధికారులు తెలిపారు. మకరవిళక్కు ఉత్సవాలు డిసెంబర్ 30 నుంచి మొదలై.. జనవరి 19 వరకు కొనసాగనున్నాయి. 2025 జనవరి 14న రోజున శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇవ్వనున్నది.