బాలరాముడికి 17న సూర్య తిలకం

అద్భుత ఘట్టానికి అయోధ్య రామాలయం సిద్ధం
విధాత, హైదరాబాద్ : రామ జన్మభూమి అయోధ్యలోని రామాలయం శ్రీరామనవమి వేడుకలకు సందర్భంగా ఓ అద్భుత ఘట్టానికి వేదిక కాబోతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున సూర్యుడి కిరణాలు నేరుగా సూర్య తిలకం రూపంలో రామ్ లల్లా(బాలరాముడి) విగ్రహం నుదుటి మీద పడనున్నాయి. ఇందుకోసం లెన్స్ (ప్రత్యేక అద్దాల) సహాయంతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించి సూర్య తిలకం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుందని తెలిపారు.
సూర్యతిలకం ఎప్పుడు చూడోచ్చు
శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం ప్రక్రియ మొదలు కాబోతుంది. 75ఎంఎం వ్యాసార్థంలో వృత్తాకార తిలకంలా సుమారు 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం నుదుటి మీద సూర్యకిరణాలు ప్రకాశించేలా ఏర్పాట్లు చేశారు. ఈ టెక్నాలజీని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. ట్రయల్ రన్‌లో పరిశోధకుల కృషి ఫలించి నిర్ధేశించుకున్నట్లుగానే శ్రీరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయి. ఈ విషయాన్ని పరిశోధకుల బృందం, ఆలయ ట్రస్ట్ అధికారులు ధ్రువీకరించారు.