మోదీపై రాహుల్‌గాంధీ పంచులే పంచులు..

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్‌ గాంధీ అధికారపక్షంపై, ప్రధాని మోదీపై పంచులు కురిపించారు. దాదాపు రెండు గంటలపాటు మాట్లాడిన రాహుల్‌గాంధీ.. తన ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించుకున్నట్టు అర్థమవుతున్నది

 మోదీపై రాహుల్‌గాంధీ పంచులే పంచులు..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్‌ గాంధీ అధికారపక్షంపై, ప్రధాని మోదీపై పంచులు కురిపించారు. దాదాపు రెండు గంటలపాటు మాట్లాడిన రాహుల్‌గాంధీ.. తన ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించుకున్నట్టు అర్థమవుతున్నది. ప్రసంగం సమయంలో శివుడి చిత్రపటాన్ని చూపిన రాహుల్‌.. బీజేపీ నేతల తీరును దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలు లేచి నిలబడి నిరసన వ్యక్తం చేయడంతో సభలో శివుడిని చూపించడాన్ని అధికారం పక్షం వ్యతిరేకిస్తున్నదని ఎద్దేవా చేశారు. అన్ని మతాలు అహింసను, నిర్భయాన్ని బోధిస్తే.. హిందువులమని చెప్పుకొనే బీజేపీ హింసను ప్రేరేపించడమే పనిగా పెట్టుకున్నదని నిప్పులు చెరిగారు. దీంతో ప్రధాని సహా అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ లేచి.. రాహుల్‌ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పారు. హిందువులను అవమానిస్తున్నారని అనడంపై స్పందించిన రాహుల్‌.. ప్రధాని మోదీ, బీజేపీ, ఆరెస్సెస్సే హిందూ సమాజం కాదని రిటార్టిచ్చారు. రాహుల్‌ ప్రసంగిస్తున్నంత సేపూ అధికార విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలతో అంతరాయం కలిగింది.
ఒక టీవీ ఇంటర్వ్యూలో మోదీ చేసిన పరమాత్మ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాట్లాడిన రాహుల్‌.. వాస్తవానికి మోదీ అయోధ్య నుంచి పోటీ చేయాలని భావించారని, కానీ.. అక్కడ పోటీ చేస్తే ఓటమి ఖాయమని సర్వేల్లో తేలడంతో ఆ ఆలోచన విరమించుకుని వారణాసి నుంచి పోటీ చేశారని అన్నారు. ఆ సమయంలో ఫైజాబాద్‌ ఎంపీ అవధేశ్‌ ప్రసాద్‌వైపు తిరిగి.. ఫైజాబాద్‌లో విజయం సాధించబోతున్నారని మీకు ఎప్పుడు అర్థమైందని తాను ఆయనను అడిగితే ఇక్కడ బీజేపీ ఓడిపోతుందని నాకు ముందునుంచే తెలుసని ఆయన సమాధానమిచ్చారని రాహుల్ తెలిపారు. రాహుల్‌ ప్రసంగం మధ్యలో ప్రధాని మోదీ రెండు సార్లు లేచి నిలబడ్డారు. పలువురు మంత్రులు సైతం అభ్యంతరం చెప్పారు. అయినా.. రాహుల్‌ తన దూకుడు తగ్గించలేదు. స్పీకర్‌ ఎన్నిక సందర్భాన్ని ప్రస్తావించిన రాహుల్‌ గాంధీ.. ‘మోదీ, నేను మిమ్మల్ని చైర్‌ వద్దకు తోడ్కొని పోయినప్పుడు మీకు నేను షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు మీరు నిటారుగానే ఉన్నారు. కానీ.. మోదీ వద్ద తలొంచారు’ అని గుర్తు చేశారు. దీనికి సమాధానం చెప్పుకొన్న ఓం బిర్లా.. తాను పెద్దలను గౌరవించాలనే సంప్రదాయాన్ని పాటించానని అన్నారు. బీజేపీ తరఫున 240 మాత్రమే ఎన్నికైన విషయంలోనూ రాహుల్ చెణుకులు విసిరారు. ‘మీకు నా శుభాకాంక్షలు’ అంటూ ఎద్దేవా చేశారు.