Ugadi Rasi Phalau 2025 | వృశ్చిక రాశి( Scorpio ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును.
సంవత్సర ప్రారంభం నుండి 15 మే 2025 వరకు చక్కటి అనుకూల కాలం ఎదురగును. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేయువారికి మిక్కిలి రూప లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించును. జీవిత భాగస్వామి సంబందించిన ఆర్ధిక లేదా స్థిర సంపద పరంగా కూడా లాభములు పొందుతారు. ధనార్జన పరంగా, సంతాన విషయ పరంగా కూడా ఈ కాలం అత్యంత అనుకూల కాలం. ఈ కాలంలో గురు గ్రహ అనుకూల బలం వలన మీరు నిర్దేశించుకున్న ఆర్ధిక లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు.
16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 మధ్య కాలంలో గురు గ్రహం వలన ప్రతికూల ఫలితాలు పొందుతారు. ఆర్ధిక విషయాలలో అదృష్టం తగ్గుతుంది. అనవసరమైన ధన వ్యయం పెరుగుతుంది. ఈ కాలంలో ఆర్ధిక పరంగా ఏ నిర్ణయం తీసుకున్న బాగా ఆలోచన చేసి ముందడుగు వేయుట మంచిది.
20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురువు తిరిగి అతి చక్కటి ఫలితాలను ప్రసాదించును. నూతన వ్యాపార పెట్టుబడులకు, ఉద్యోగ మార్పులకు, జీవితంలో ముఖ్య నిర్ణయాలు తీసుకొనుటకు ఈ కాలం అత్యంత అనుకూల కాలం.
6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు గురు గ్రహ అనుకూలత తగ్గుతుంది. వ్యక్తిగత జీవితంలో మరియు కెరీర్ రీత్యా కూడా ఈ కాలం ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం వక్ర గతిలో కలిగి ఉన్న లేదా నీచ క్షేత్రంలో కలిగి ఉన్న వారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండవలెను. ఒక పర్యాయం గురు గ్రహ శాంతి జపం జరిపించుకోనుట కూడా మంచిది.
వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన కూడా సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. కెరీర్ రీత్యా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూల కాలం. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు చేయు సంతాన ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతట ప్రతికూల ఫలితాలు ఎదురగును. మాత్రు వర్గీయులతో విభేదాలు ఎదుర్కొందురు. సంతాన ప్రయత్నాలలో ముఖ్యంగా సర్ప దోషం కలిగిన వారికి అనేక అడ్డంకులు ఎదురగును. విద్యార్దులకు కూడా శ్రమ అధికం అగును. వ్యసనాల పట్ల ఆకర్షింపబడటం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా 16 జూలై 2025 నుండి 2 సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో వృశ్చిక రాశి వారు అన్ని విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఎదురగును. ఆర్ధిక సంబంధ విషయాలలో అభివృద్ధికి అవసరమగు అవకాశములు లభించునట్లు చేయును. ముఖ్యంగా 18 మే 2025 వరకు భూ లేదా గృహ క్రయ విక్రయాలకు, వ్యాపార పరమైన పెట్టుబడులకు అనుకూల కాలం. 19 మే 2025 నుండి సామాన్య ఫలితాలు ఎదురగును.