Bonalu Festival | బోనాల పండుగ తెలంగాణలో ఎంతో ప్రత్యేకం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. ఆషాడమాసంలో వచ్చే బోనాల పండుగ శోభ రాష్ట్రవ్యాప్తంగా సంతరించుకున్నది. ప్రజలు ఆది, గురువారాల్లో గ్రామదేవతలకు బోనాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. నేటినుంచి బోనాల పండుగ ప్రారంభం కానున్నాయి. తొలుత హైదరాబాద్‌లోని గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజ, బల్కంపేట ఆలయాల్లో బోనాల వేడుకలు జరుగుతాయి. బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని గల్లీ గల్లీ ముస్తాబైంది. ఆలయాలకు రంగులుదిద్ది.. విద్యుద్దీపాలతో అలంకరించారు. గోల్కొండలోని జగదాంబిక ఆలయాన్ని బోనాల వేడుక సందర్భంగా సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి బోనం సమర్పించి, తొట్లెలను కూడా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించనున్నారు. అంతేకాకుండా.. ఫలాహరం బండ్లను ఊరేగింపులు చేసి, శివసత్తులు, పొతరాజుల విన్యాసాలతో ఎంతో భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనం అంటే భోజనం. అమ్మవారు వర్షాకాలంలో కలిగే వ్యాధులు వ్యాప్తి చెందకుండా, కుటుంబాలను చల్లగా చూడాలంటూ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కుకుంటారు. అందుకే కుండలో పెరుగన్నం, దానిపైన చల్లని వేప నీరు, దానిపైన దీపం పెట్టి బోనం సమర్పిస్తారు. ఆ తల్లి ఈ బోనం స్వీకరించి మనల్ని చల్లగా చూస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
గోల్గొండలోనే తొలిబొనం ఎందుకంటే..?
గోల్గొండలోని జగదంబిక అమ్మవారి ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్నది. ఇక్కడ వెలసిన అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా భావిస్తారు. కాకతీయులు, తానీషా కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుంచి పటేల్ వంశం బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ సమర్పించే బోనాన్ని నజర్ బోనం అని కూడా పిలుస్తారు. ఇప్పటికి కూడా ఆయా వంశాల వారు వందల ఏళ్లుగా తమ కుటుంబంవారు బోనం సమర్పిస్తూ వస్తున్నారు. ఇక హైదరాబాద్‌కు గొల్గొండ కోట ఓ మణిహరం. అందుకే ఇక్కడ తొలిబొనం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆదివారం లంగర్ హౌజ్ నుంచి బోనం ప్రారంభమై.. గోల్కొండ వరకు ఊరేగింపుగా వెళ్తారు. ప్రతి ఆదివారం, గురువారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గోల్గొండ బోనాల తర్వాత బల్కంపేట ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు. 8న ఎదుర్కొలు ఉత్సవం, 9 కల్యాణం, 10న రథోత్సవం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలు కూడా సమర్పిస్తారు.
నగరంలో బోనాలు ఇలా..
7న ఆదివారం గోల్గొండ జగదాంబిక బోనాలు
9న మంగళవారం బల్కంపేట అమ్మవారి కల్యాణం
7న ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఎదుర్కొలు ఉత్సవం
21న ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
28న ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు
29న సోమవారం సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం, భవిష్య వాణి ఉత్సవం