Vastu Tips | చాలా మంది చాలా రకాలుగా డబ్బు సంపాదిస్తుంటారు. కానీ ఆ డబ్బు ఇంట్లో ఎక్కువ కాలం నిలవదు. నీళ్ల మాదిరిగా ఖర్చు అవుతుంటుంది. మరి అంత కష్టపడ్డా.. డబ్బు ఎందుకు వృథాగా ఖర్చు అవుతుందంటే.. అందుకు కారణం వాస్తు నియమాలు పాటించకపోవడమే. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా భారీ ఆర్థిక కష్టాలకు కారణం అవుతున్నట్లు వాస్తు నియమాలు చెబుతున్నాయి. మరి ఆర్థిక కష్టాల నుంచి అధిగమించాలంటే.. ఈ వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే.
ఇంట్లో నైరుతిని నిర్లక్ష్యం చేయకూడదు..
వాస్తు ప్రకారం నైరుతి దిక్కు సంపదకు, స్థిరత్వానికి ప్రతీక. నైరుతి దిశలో చెత్త వేయడం, ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగా ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఇంట్లో అమాంతం ఖర్చులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి నైరుతి దిశను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది.
ఈశాన్యం కూడా..
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం కూడా ఎంతో పవిత్రమైన భాగం. ఇంట్లో అయినా, కార్యాలయంలో అయినా.. ఈ దిశలో పూజ జరిగేలా చూసుకోవాలి. ఈశాన్యం దిశను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ భాగంలో చెత్తగా ఉండడం, శుభ్రంగా లేకపోవడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపదకు ఆటంకాలు ఎదురవుతాయి.
వంటిల్లు వాస్తు ప్రకారం ఉండాల్సిందే..
ఇంటిని ఎంత గొప్పగా నిర్మించిన వంటిల్లు వాస్తు ప్రకారం లేకపోతే ఆర్థిక కష్టాలు తప్పవు. వంటిల్లు వాస్తు ప్రకారం ఉండాల్సిందే. ఇక వంటిల్లుకు ఆగ్నేయ దిశ చాలా ముఖ్యం. ఆగ్నేయంలో వంట చేయడం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. డబ్బు కూడా సమకూరుతుంది.
నల్లాలు లీకేజీ కావొద్దు..
వాస్తును నియమాల ప్రకారం నీటి కుళాయిల్లో లీకేజీలు ఉండడం, నీటి పైపుల్లో లీకేజీలు ఉండడం డబ్బు వృథాకు సంకేతాలుగా చెప్పుకోవాలి. ఇవి మాత్రమే కాదు విరిగిపోయిన కిటికీలు, అద్దాలు కూడా ఇలాంటి సంకేతాలనే ఇస్తాయి. కనుక ఇంట్లో ఇలాంటి స్థితి లేకుండా జాగ్రత్త పడాలి.