ఫీజుల పెంపుపై ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు షాక్

విధాత, హైదరాబాద్ : ఫీజులు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు అధారపడి ఉంటుందని పిటిషన్ విచారించిన జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. అయితే ఫీజుల పెంపుకోసం కాలేజీలు ఇచ్చిన ప్రతిపాదనలపై TAFRC(తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ) ఆరువారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది.
ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ ఫీజులే 2025-26 విద్యాసంవత్సరానికి కూడా వర్తిస్తాయంటూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన GO 26ను సవాలు చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు కాలేజీలతో పాటు సుమారు 11 కళాశాలలు గురువారం లంచ్ మోషన్ పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి ఏటా ఓ తంతు నడుస్తోందంటూ TAFRC తీరుపై నిన్న విచారణ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా కాలేజీలు ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయడం, కౌన్సెలింగ్ పూర్తయి అడ్మిషన్‌లు చేపట్టేదాకా దానిపై TAFRC సిఫారసులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం అన్నది ప్రతి ఏడాది కొనసాగుతోందని అసహనం వ్యక్తం చేసింది. మూడేళ్లకోసారి కాలేజీలను పరిశీలించి పెంపుపై TAFRC నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదన్నారు. డిసెంబరులో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు నిర్ణయం తీసుకోలేదని, 15 మంది సభ్యులతో ఉన్న ఈ కమిటీకి డిసెంబర్ లో కాలేజీలు ప్రతిపాదనలు అందిస్తే జూన్ వరకు నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అటు కాలేజీలు TAFRCపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని, కౌన్సెలింగ్ పూర్తయ్యాక పిటిషన్‌లు వేయడమేమిటని ప్రశ్నించారు.
కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ గత డిసెంబరులో ప్రతిపాదనలు సమర్పించామని, మార్చిలో కమిటీ సమావేశమైందని, అందులో తమ ప్రతిపాదనలు ఆమోదించిందని, దీనికి రిజిస్టర్‌లో నమోదు చేసిన వివరాలే నిదర్శనమన్నారు. TAFRC తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం కాలేజీలు 5,000 పేజీలతో ప్రతిపాదనలు సమర్పించాయని..వాటి పరిశీలన ప్రక్రియతో ఆలస్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో గత బ్లాక్ పీరియడ్‌లో వసూలు చేసిన మొత్తాన్నే ఈ ఏడాదికి సిఫారసు చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు అభ్యంతరకరంగా.. గత ఏడాది కంటే 70 నుంచి 90 శాతం అధికంగా ఫీజుల పెంపును ప్రతిపాదించి విషయాన్ని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజుల పెంపులో TAFRC సూచనల మేరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు.