A Beautiful Breakup Review: విడిపోవడంలోనే ప్రేమను వెతికిన ‘ఏ బ్యూటిఫుల్ బ్రేకప్’

విడిపోవడానికి కలిసిన జంట జీవితాల్లో ఒక ఆత్మ జోక్యం చేసుకుంటే ఏమవుతుంది? తక్ష్, మటిల్డా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఏ బ్యూటిఫుల్ బ్రేకప్’ చిత్రానికి ఇళయరాజా సంగీతం హైలైట్. పూర్తి రివ్యూ, రేటింగ్ తెలుసుకోండి.

A Beautiful Breakup Review: విడిపోవడంలోనే ప్రేమను వెతికిన ‘ఏ బ్యూటిఫుల్ బ్రేకప్’

A Beautiful Breakup Movie Review & Rating: A Tender Love Story With a Spiritual Twist

విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

A Beautiful Breakup Review | వాలెంటైన్స్ వీక్‌లో విడుదలైన ఆంగ్ల చిత్రం బ్యూటిఫుల్ బ్రేకప్ (A Beautiful Breakup) ప్రేమ, విడిపోవడం, ఆత్మీయత అనే మూడు భావాలను ఒకే ఫ్రేమ్‌లో మిళితం చేసిన వినూత్న ప్రయత్నంగా నిలిచింది. తెలుగువారు నిర్మించిన ఈ చిత్రంలో తక్ష్ ముద్రగడ, మటిల్డా బాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వం వహించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చింది.

విడిపోవాలని నిర్ణయించుకున్న కృష్ణ (తక్ష్) – రూబీ (మటిల్డా) ఒక ప్రశాంతమైన కాటేజీలో చివరి రాత్రి గడపడానికి చేరుతారు. గిఫ్టులు తిరిగి ఇచ్చుకోవడం, తీయని జ్ఞాపకాలు పంచుకోవడం, నక్షత్రాలను చూస్తూ కవిత చదవడం – ఈ అందమైన ముగింపుకు అనూహ్యంగా ఓ ఆత్మ జతకడుతుంది. మాయాసీసాల్లో బంధించబడిన ఆత్మలు వారి జీవితాల్లో జోక్యం చేసుకుంటే… ప్రేమ అంతమవుతుందా? లేక మరోసారి పునఃప్రారంభమవుతుందా? అన్నది కథ.

నటనలో నిజాయితీసంగీతంలో మాయ

A Beautiful Breakup movie review poster featuring Thaksh and Matylda Bajer, Ilaiyaraaja musical romantic drama

తక్ష్ తన తొలి చిత్రంలోనే ఎంతో సహజంగా నటించి ఆకట్టుకున్నాడు. బ్రేకప్ సమయంలో కూడా ల్యాప్‌టాప్‌పై పని చేస్తూ, మరోవైపు తన ప్రేమను కోల్పోతున్న వ్యక్తి మౌనాన్ని ఆయన నిశ్శబ్దంగా వ్యక్తపరిచాడు. అతని పాత్రలో హీరోయిజం కంటే మానవత్వం ఎక్కువగా కనిపిస్తుంది.

మటిల్డా బాజర్.. రూబీ పాత్రలో సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా పలికించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ముఖ్యంగా వారి ‘షేర్డ్ బర్త్‌డే’ సీన్ ప్రేక్షకుడి మనసును తడుముతుంది.

సాంకేతికంగా ఈ చిత్రానికి ప్రధాన బలం మాస్ట్రో ఇళయరాజా సంగీతం. బో టై ఆర్కెస్ట్రాతో రూపొందించిన సింఫనీ స్కోర్, భావోద్వేగ దృశ్యాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ ప్రశాంత ప్రకృతి మధ్య ఓ అంతుబట్టని భావనను సృష్టించింది.

హారర్ కాదుహార్ట్‌ఫుల్ ట్విస్ట్

ఇది సాధారణ హారర్ సినిమా కాదు. రాత్రివేళ భయంతో ఎగిరి గంతులేయించే సినిమాలకు బదులుగా, ఈ చిత్రం మనసును తాకే ‘ఆధ్యాత్మిక ఆత్మ’ను చూపిస్తుంది. ఆత్మను ప్రతీకాత్మకంగా ఉపయోగించి ప్రేమలోని మౌనాన్ని, అపార్థాలను ప్రతిబింబించారు.

కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ, నాయికానాయకుల భావోద్వేగ ప్రయాణం కట్టిపడేస్తుంది. క్లైమాక్స్‌లో సాధారణంగా ఊహించే హారర్ ట్విస్ట్‌ బదులుగా మరింత మానవీయమైన ముగింపు ఇవ్వడం ఈ చిత్రానికి ప్రత్యేకత.

‘ఏ బ్యూటిఫుల్ బ్రేకప్’ ఒక సున్నితమైన ప్రేమకథ. విడిపోవడంలో కూడా ఆశను వెతికే భావోద్వేగ చిత్రం. భయంకర హారర్ కంటే మృదువైన రొమాంటిక్ డ్రామాను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఎంపిక. చాలా మంచి చిత్రం. ప్రేమికులు తప్పకచూడవలసిన సినిమా. మనసును, మానవత్వాన్ని, నిశ్శబ్దాన్ని ఇష్టపడేవారు ఒంటరిగా చూడండి. నచ్చుతుంది.

విధాత రేటింగ్: 3.25/5