Chiranjeevi | భార్య సురేఖకు మెగాస్టార్ ప్రేమ సందేశం.. ఎమోషనల్ ట్వీట్‌తో అభిమానుల హృదయాలు గెలిచిన చిరంజీవి
Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వ్యక్తిత్వంతో అభిమానుల మనసులను కట్టిపడేశారు. వయసు పెరుగుతున్నా ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌లో యంగ్ హీరోలకు సవాల్ విసురుతూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వ్యక్తిత్వంతో అభిమానుల మనసులను కట్టిపడేశారు. వయసు పెరుగుతున్నా ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌లో యంగ్ హీరోలకు సవాల్ విసురుతూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితంలోనూ చిరంజీవి ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. తన కుమారుడు రామ్ చరణ్ – కోడలు ఉపాసన కొణిదెల దంపతులకు ఇటీవల కవలలు జన్మించడంతో చిరంజీవి మరోసారి తాతయ్యగా మారారు. కుటుంబంలో ఈ సంతోష వాతావరణం మధ్య ఆయన చేసిన ఒక ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి – సురేఖ కొణిదెల దంపతుల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను చిరంజీవి తన కెరీర్ ప్రారంభ దశలోనే వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్న వారి దాంపత్య జీవితం టాలీవుడ్‌లో ఆదర్శంగా నిలిచింది. కెరీర్‌లో ఎత్తుపల్లాలు వచ్చిన ప్రతి సమయంలో సురేఖ తనకు అండగా నిలిచిందని చిరంజీవి అనేకసార్లు వెల్లడించారు.
తాజాగా సురేఖ పుట్టినరోజు మరియు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్టు అభిమానులను కదిలించింది. “నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే… అది నా ప్రతిభ కాదు, కష్టం కాదు… ‘అది నువ్వే’ అని చెబుతాను” అంటూ ఆయన ప్రేమతో నిండిన సందేశాన్ని పంచుకున్నారు.
కుటుంబానికి కేంద్రబిందువుగా నిలిచిన సురేఖ తన తల్లిదండ్రులకు నిజమైన కూతురిలా మారిందని, కుటుంబ బంధాలను ప్రేమతో కట్టిపడేసిందని చిరంజీవి పేర్కొన్నారు. “నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు… నా బలం, నా ఆధారం, నా ప్రశాంతత” అని ఆయన రాసిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి వ్యక్తిగత జీవితంలోని ఈ మధుర క్షణం అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram