టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలంగాణ యాస బాషలు..కథలతో కూడిన సినిమాలు క్రమంగా పెరుగుతు వస్తున్నాయి. తాజాగా “ఇడుపుకాయితం” సిన్మా టైటిల్ ఒకటి ఆసక్తికరంగా మారింది. దర్శకుడు సుకుమార్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ తెలంగాణ యాస, భాషను తలపిస్తుండటమే ఓ విశేషమైతే…ఇందులో తెలంగాణ ఫోక్ సింగర్, యాక్టర్ నాగదుర్గ హీరోయిన్ కావడం మరో విశేషం. హీరోయిన్ గా నాగదుర్గకు ఇది వెండితెరపై మొదటి సినిమా కావడం విశేషం.
విడాకులు అనే మాటను మన తెలంగాణ భాషలో “ఇడుపుకాయితం” అని పిలవడం తెలిసిందే. తెలంగాణ యాస, సంస్కృతితో ముచ్చట చెప్పే “ఇడుపుకాయితం” సిన్మాలో ప్రియదర్శి హీరో, నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌న ప్రచార పోస్టర్‌లో కొత్త పెండ్లి జంట హైదరాబాద్ పోయే దారిలో టీజీ నెంబర్ ప్లేట్ బండి మీద క్యారియర్, కల్లు బాటిల్, చెకినాలు కట్టుకొని పోతున్నరు, సూత్తాంటేనే మన పల్లెటూరి బతుకంత గుర్తొస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే అంత అందమైన పెళ్లి జంట మధ్య ‘విడాకుల కాగితం’ (ఇడుపుకాయితం) అనే సమస్య ఎందుకు వచ్చిందనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ సినిమా సాగనుంది.
బన్నీ వాస్ నిర్మాతగ ావంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభించుకోగా..హీరో ప్రియదర్శి మాట్లాడుతూ..ఇందులో శ్రీనివాస్ అనే పాత్రలో కనిపిస్తానని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ, నా ఇంట్లోనూ ఉన్న కథనే ఈ సినిమా అని,ఇక మాటల్లేవు, ఏం మాట్లాడినా సినిమా చూపించే మాట్లాడతాం అని చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో ‘ఇడుపు కాయితం’రచ్చ..
‘ఇడుపు కాయితం’ టైటిల్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాభిమానులు ఇదేమి టైటిల్..ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా.. ఇది అసలు తెలుగు భాషేనా అంటూ పోస్టులు పెట్డగా..మా యాస, భాషాలపై ఇంకా మీ ఏడుపేందంటూ తెలంగాణ వాదులు కౌంటర్లు వేస్తున్నారు. ఇక్కడ సమస్య ఒక పదం అర్థమవ్వడం, కాకపోవడం కాదు.. ఇక్కడ సమస్యల్లా ఆధిపత్య ధోరణి, అహంభావం అంటు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
తెలంగాణ మాండలికంలో ఉన్న ‘ఇడుపు కాయితం’ అనే పదం అర్థం ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి అర్థమవ్వకపోవడంలో ఆశ్చర్యం..తప్పు లేదని, అయితే తెలంగాణ గ్రామీణ జీవనంలో వాడే ఒక పదాన్ని ఒక సినిమాకు టైటిల్‌గా పెట్టినప్పుడు.. అర్థం కాకుంటే వివరణ అడిగితే సరిపోతుంది. కానీ ఎగతాళిగా మాట్లాడుతూ.. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా.. ఇది అసలు తెలుగు భాషేనా అని మాట్లాడటం ఎందుకంటూ తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళోజీ అన్నట్లు.. మా తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష..ఇడుపు కాయితం కూడా ఇదేనంటు వివరిస్తున్నారు. ఎవరి భాష, యాస వాళ్లకి గొప్ప.. ఇతరుల యాసను, భాషను ఎగతాళి చేసే హక్కు ఎవరికీ లేదు అని స్పష్టం చేస్తున్నారు.