‘కొత్త మలుపు’ హీరోయిన్ భైరవి ఆర్థ్యాతో మీడియా ప్రతినిధులు స్పెషల్ చిట్‌చాట్
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా, శివ వరప్రసాద్ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అస్సాం నుంచి వచ్చి తెలుగు భాష నేర్చుకుని, కొనసీమ అమ్మాయి పాత్రలో నటించిన ఆమె తన సినీ ప్రయాణం, సినిమా విశేషాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఈ చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రశ్న: మీ నేపథ్యం గురించి చెప్పండి. అస్సాం నుంచి టాలీవుడ్ వరకు మీ ప్రయాణం ఎలా సాగింది?
భైరవి ఆర్థ్యా: నేను అస్సాంకు చెందిన అమ్మాయిని. మా కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ అక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచే సినిమాలు, నటన అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు కూడా చూస్తూ పెరిగిన నేను ఒక రోజు నటిగా మారాలనే కల కనడం ప్రారంభించాను. ఆ కలనే లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేసాను.
ప్రశ్న: ‘కొత్త మలుపు’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
భైరవి: నా చదువుతో పాటు ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పట్లో నాకు తెలుగు అస్సలు రాదు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు నిరంతరం ఆడిషన్స్ ఇస్తూ, తెలుగును నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించాను. చుట్టుపక్కల వాళ్లతో తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ భాషపై పట్టు సాధించాను. ఆ కృషి ఫలితమే ఈ సినిమా.
ప్రశ్న: సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.
భైరవి: ఈ చిత్రంలో నా పాత్ర పేరు వరలక్ష్మి. ఆమె కొనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే అందమైన పాత్ర ఇది. నటిగా నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన క్యారెక్టర్.
ప్రశ్న: కొనసీమ నేపథ్యంలో నటించడం ఎలా అనిపించింది?
భైరవి: కొనసీమ ప్రకృతి అందాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. కొబ్బరి తోటలు, అక్కడి సంస్కృతి, ఆహారం అన్నీ నాకు కొత్త అనుభవం. ముఖ్యంగా సీఫుడ్ చాలా నచ్చింది. అస్సంలోని మా జీవన శైలి వేరు ఇక్కడి కొనసీమ లైఫ్‌స్టైల్ వేరుగా ఉంటాయి. అందుకే షూటింగ్ ప్రారంభానికి ముందు నెల రోజుల పాటు అక్కడే ఉండి స్థానికుల జీవనశైలి, డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్, యాస అన్నింటినీ పరిశీలించి నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు నన్ను చూసి చాలామంది అస్సాం నుంచి వచ్చానని గుర్తించలేరు. అచ్చ తెలుగమ్మాయి అని అందరూ అంటున్నారు.
ప్రశ్న: ఈ సినిమాలో మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏమిటి?
భైరవి: భాషే పెద్ద సవాలు. తెలుగు నేర్చుకున్నప్పటికీ గోదావరి ప్రాంత యాసను పట్టుకోవడం అంత సులభం కాదు. అలాగే వర్షాకాలంలో షూటింగ్ జరగడంతో వాతావరణ పరిస్థితులు కూడా కొంత ఇబ్బంది కలిగించాయి. అయితే టీమ్ అందరి సహకారంతో ఆ సవాళ్లను అధిగమించగలిగాను.
ప్రశ్న: దర్శకుడు, హీరో నుంచి ఎలాంటి సహకారం లభించింది?
భైరవి: దర్శకుడు శివ వరప్రసాద్ గారు చాలా ఓపికగా ప్రతి సన్నివేశాన్ని వివరించేవారు. ఏ డైలాగ్ అర్థం కాకపోయినా సులభంగా చెప్పి నటించడానికి సహాయపడ్డారు. హీరో ఆకాష్ కూడా ఎంతో సహకరించారు. కొత్త వ్యక్తినైనా ఎక్కడా అసౌకర్యంగా అనిపించలేదు. వీరందరి సహకారంతో నేను ఈ సినిమా బెటర్‌గా చేయగలిగాను అని చెప్పగలను.
ప్రశ్న: తెలుగు సినీ పరిశ్రమ గురించి మీ అభిప్రాయం?
భైరవి: నేను స్కూల్ రోజుల నుంచే తెలుగు సినిమాలకు అభిమానిని. ముఖ్యంగా ఇక్కడి కథలు, భావోద్వేగాలు చాలా బాగుంటాయి. టాలీవుడ్‌లో అందరూ ఎంతో ప్రోత్సాహకరంగా వ్యవహరించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నటనలో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. హైదరాబాద్‌లోని నటరంగ్ థియేటర్‌లో ఆరు నెలల పాటు యాక్టింగ్ శిక్షణ కూడా తీసుకున్నాను.
ప్రశ్న: మీకు ఇష్టమైన తెలుగు హీరోలు, హీరోయిన్లు ఎవరు?
భైరవి: హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు చాలా ఇష్టం. హీరోయిన్లలో రష్మిక మందనా, సమంత గారిని ఎంతో అభిమానిస్తాను.
ప్రశ్న: హైదరాబాద్‌లో మీకు నచ్చిన విషయం ఏమిటి?
భైరవి: హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది చికెన్ దమ్ బిర్యానీ. నాకు చాలా ఇష్టం. నగర వాతావరణం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం కూడా బాగా నచ్చాయి.
ప్రశ్న: ‘కొత్త మలుపు’ సినిమా చూసారా? ఎలా అనిపించింది?
భైరవి: అవును. నేను ఇప్పటికే మూడు సార్లు సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఇందులో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, కామెడీ, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి వర్గం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను.
ప్రశ్న: ఓటీటీ ప్రాజెక్టులపై ఆసక్తి ఉందా?
భైరవి: ఖచ్చితంగా ఉంది. నాకు మంచి కథ, మంచి పాత్ర. అది సినిమా అయినా, ఓటీటీ ప్రాజెక్ట్ అయినా నేను సిద్ధమే. నటిగా మంచి పేరు తెచ్చుకోవడం, నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం నా లక్ష్యం.
ప్రశ్న: మీకు స్ఫూర్తి ఎవరు?
భైరవి: ఒక్కరి పేరును చెప్పడం కష్టం. ప్రతి సీనియర్ ఆర్టిస్ట్ ప్రయాణం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. వారి కష్టాలు, విజయాలు నాకు స్ఫూర్తినిస్తాయి.
ప్రశ్న: గ్లామర్‌పై మీ అభిప్రాయం?
భైరవి: గ్లామర్ ఒక హీరోయిన్‌కు అవసరమే. కానీ అది మాత్రమే సరిపోదు. నటన, పాత్రల ఎంపిక, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రదర్శన కూడా అంతే ముఖ్యమైనవి. మంచి సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను.
చివరగా…
“తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అందరి ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ‘కొత్త మలుపు’ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించండి. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని భైరవి ఆర్థ్యా తెలిపారు.
అస్సాం నుంచి వచ్చి టాలీవుడ్ స్క్రీన్‌పై వాలిన ఓ ముద్దుగుమ్మ… ‘కొత్త మలుపు’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రయాణం ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుందన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్
