Ashu Reddy | సినీ నటి అషురెడ్డి (కె. వెంకట అశ్విని రెడ్డి)పై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.9.83 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా బయటకు వచ్చిన ఆడియో సందేశం కీలక మలుపు తీసుకొచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియోలో, మే నెలలో కోటిన్నర రూపాయలు తిరిగి ఇస్తానని, మిగిలిన డబ్బును భవిష్యత్తులో స్థిరపడిన తర్వాత చెల్లిస్తానని అషురెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ దీనికి అంగీకరించకపోతే సినీ నిర్మాత ప్రవీణ, అలాగే వేణుస్వామి వంటి వ్యక్తుల సమక్షంలో సెటిల్‌మెంట్ చేసుకుందామని సూచించినట్లు సమాచారం.
విడతల వారీగా వసూలు..
మరోవైపు లండన్‌లో ఉన్న ధర్మేంద్ర కూడా ఓ ఆడియో విడుదల చేస్తూ అషురెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఎనిమిదేళ్లుగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విడతల వారీగా రూ.9.83 కోట్లు తీసుకున్నారని తెలిపారు. తనతో బంగ్లాలు, కారు కొనిపించుకున్నారని, రెండు సార్లు వివాహ తేదీలు ఖరారు చేసినప్పటికీ చివరి నిమిషంలో ఆమెే రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడేమో తన డబ్బు తిరిగి అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని, వేధింపుల కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ధర్మేంద్ర ఆరోపించారు. అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా తన వద్ద నుంచి భారీగా నగదు తీసుకున్నారని, బ్యాంకు రుణాలు తీసుకుని మరీ డబ్బులు ఇచ్చానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు తీసుకుని ఇప్పుడు కేవలం కోటిన్నరతో సెటిల్ చేస్తాననడం మరోసారి మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
హైకోర్టుని ఆశ్రయించిన అషూ రెడ్డి..
ఈ వ్యవహారం మరింత ముదురుతుండగా అషురెడ్డి న్యాయపోరాటానికి దిగారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తన తల్లితో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తన వాదన వినకుండా ఏకపక్షంగా కేసు నమోదు చేశారని, విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో తన పేరు రావడంపై నిర్మాత ప్రవీణ స్పందిస్తూ, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, బాధితుడు ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైతే అషురెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని డీసీపీ వెల్లడించారు.
రాజకీయ, సినీ ప్రముఖుల పేర్లు ఉపయోగించి బాధితుడిని భయపెట్టారా అనే కోణంలోనూ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఈ కేసు మరిన్ని సంచలన అంశాలను వెలికితీయవచ్చని అంచనా వేస్తున్నారు.
