Bharati Raja | దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. గ్రామీణ నేపథ్య కథలను సహజత్వంతో తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన ఆయనను అభిమానులు ప్రేమగా “ఇయక్కునార్ ఇమయం” అని సంభోదిస్తారు. వయసు పైబడటం, ఇటీవల ఎదురైన వ్యక్తిగత విషాదాలు ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
తాజాగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తన గురువైన భారతీరాజాను పరామర్శించారు. శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఆయనను వీల్‌చైర్‌లో చూసిన రాధికా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన గురువు నుంచి వచ్చిన ప్రశంసలు తనకు ఏ అవార్డు కన్నా గొప్పవని పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన తన చిత్రం ‘తాయ్ కిళవి’ను చూసిన భారతీరాజా, రాధికా నటనను మెచ్చుకుని ఆమెకు జాతీయ అవార్డు రావాలని ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన రాధికా, “నా గురువు గారి మాటలు నాకు అత్యంత విలువైనవి. ఆయనలో సినిమాపై ఉన్న అంకితభావమే ఈ స్థితిలోనూ ఆయనను ముందుకు నడిపిస్తోంది. కానీ ఆయనను ఇలాంటి పరిస్థితిలో చూడటం మాత్రం నాకు చాలా బాధ కలిగిస్తోంది” అంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.
వెండితెరపై విప్లవం సృష్టించిన దర్శకుడు
1977లో ‘16 వయతినిలే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా, అప్పటి వరకు స్టూడియోలకు పరిమితమైన సినిమాలను గ్రామీణ వాతావరణంలోకి తీసుకెళ్లి కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. పల్లె జీవనశైలిని, సహజమైన భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘సిగప్పు రోజాక్కల్’, ‘అలైగల్ ఓయివతిల్లై’, ‘ముదల్ మరియాదై’ వంటి చిత్రాలు ఆయన సృజనాత్మకతకు నిలువెత్తు ఉదాహరణలు. తెలుగులో ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా కమల్ హాసన్, రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల కెరీర్‌ను మలుపు తిప్పడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే రాధికా, రేవతి వంటి ప్రముఖ నటీమణులను సినీ రంగానికి పరిచయం చేశారు. తన కెరీర్‌లో 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ వంటి గౌరవాలను అందుకుని సినీ లోకంలో చిరస్థాయిగా నిలిచారు.
వ్యక్తిగత విషాదం.. ఆరోగ్యంపై ప్రభావం
భారతీరాజా జీవితాన్ని గత ఏడాది జరిగిన విషాదం తీవ్రంగా కుదిపేసింది. 2025 మార్చిలో ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం ఆయనను మానసికంగా దెబ్బతీసింది. ఈ సంఘటనతో పాటు వయసు ప్రభావం కారణంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికీ, సినిమా పట్ల ఆయన ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఇప్పటికీ కొత్త తరం నటులను ప్రోత్సహిస్తూ, సినిమాపై తన ప్రేమను కొనసాగిస్తున్న భారతీరాజా ఆత్మస్థైర్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా ఉండాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
