Chiranjeevi | హనుమజ్జయంతి సందర్భంగా చిరంజీవి ఇంట్లో అద్భుతం.. సూర్యకిరణాలు తాకిన ఆంజనేయుడి విగ్రహం

Chiranjeevi | హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. ఈ పవిత్ర రోజున సినీ ప్రముఖులు కూడా తమ భక్తిని వ్యక్తపరుస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడిగా పేరుగాంచిన విషయం తెలిసిందే.

Megastar Chiranjeevi

Chiranjeevi | హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. ఈ పవిత్ర రోజున సినీ ప్రముఖులు కూడా తమ భక్తిని వ్యక్తపరుస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడిగా పేరుగాంచిన విషయం తెలిసిందే.

గురువారం (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. “అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుత దృశ్యాన్ని మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్.. జై హనుమాన్” అని ఆయన పేర్కొన్నారు.

అపురూప దృశ్యం..

ఈ సందర్భంగా తన ఇంట్లోని పూజామందిరంలో చోటుచేసుకున్న అపూర్వ దృశ్యాన్ని వివరించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి హనుమంతుడి విగ్రహాన్ని పై నుంచి కింద వరకు తాకుతూ ప్రసరించడం చూడటం తనకు దైవానుభూతి కలిగిస్తుందని తెలిపారు. ఆ దృశ్యం మాటల్లో చెప్పలేనిదని భావోద్వేగంగా చెప్పారు.

ఇటీవల అయోధ్యలో బాలరాముడి విగ్రహంపై సూర్యకాంతి పడిన అద్భుతాన్ని గుర్తు చేస్తూ, కోణార్క్, అరసవల్లి దేవాలయాల్లో కూడా ఇలాంటి విశేషాలు జరుగుతాయని చిరంజీవి చెప్పారు. అలాంటి దైవిక అనుభూతి తన ఇంట్లోనూ కలగడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.

నెటిజ‌న్స్ కామెంట్స్..

చిరంజీవి పంచుకున్న వీడియోలో హనుమంతుడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, అభిమానులు స్పందిస్తూ “సూర్యభగవానుడే ఆంజనేయుని పేరుతో మీ ఇంటికి వచ్చినట్టుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా ఏదో ఒక విధంగా తన భక్తిని తెలియజేస్తుంటారు. గతంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సమయంలో సెట్లోకి వచ్చిన వానరం వీడియోను పంచుకోగా, మరొకసారి తన సినిమా పాటను విడుదల చేశారు. ఈసారి మాత్రం తన ఇంట్లో జరిగిన ఈ అపూర్వ దృశ్యాన్ని అభిమానులతో పంచుకోవడం విశేషంగా నిలిచింది.

Latest News