Chiranjeevi | మదర్స్ డే సందర్భంగా సినీ ప్రముఖులు తమ తల్లులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, అన్నా లెజినోవా, లావణ్య త్రిపాఠి చేసిన పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ హృదయాన్ని హత్తుకునే సందేశాన్ని పంచుకున్నారు. “అమ్మ… మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం, కనిపించే దైవం కూడా ‘కని పెంచిన’ మాతృమూర్తి తర్వాతే. మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు” అంటూ ఆయన పేర్కొన్నారు.
అరుదైన ఫొటోలు..
ఈ సందర్భంగా చిరంజీవి తన కుటుంబానికి సంబంధించిన అరుదైన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలలో ఆయన తల్లిదండ్రులు కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి, భార్య సురేఖతో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబు మరియు కుటుంబ సభ్యులు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా మాతృదినోత్సవం సందర్భంగా ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. మాతృత్వం అంటే కేవలం పరిపూర్ణత కాదని, ప్రతి మహిళలోని బలం, త్యాగం, ప్రేమను గౌరవించాల్సిన రోజు ఇదని ఆమె పేర్కొన్నారు.
“19 ఏళ్లకే తల్లులైన మహిళల నుంచి, ఎన్నో కష్టాల తర్వాత ఐవీఎఫ్ ద్వారా తల్లితనం పొందిన మహిళల వరకు… ఒంటరిగా పిల్లలను పెంచుతున్న తల్లుల నుంచి బిడ్డను కోల్పోయిన తల్లుల వరకు… ప్రతి మహిళ ప్రయాణం ప్రత్యేకమే. మాతృత్వంలోని ప్రతి రూపం వెనుక ఎన్నో కనిపించని త్యాగాలు, భయాలు, ప్రేమ ఉంటాయి. ఈ రోజు పరిపూర్ణత గురించి కాదు… మహిళలను గౌరవించడం గురించి” అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, అంజనా దేవి మరియు తన కుమార్తెతో కలిసి దిగిన ఫోటోను అన్నా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక మరో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా తన తల్లితో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేయగా, అవి నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
అమ్మ…
మన మొదటి గురువు,
మన మొదటి ధైర్యం,
కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!మన విజయాల వెనక త్యాగం…
మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Happy… pic.twitter.com/SJ1AchhEPz— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2026
