Chiranjeevi | హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేస్తూ మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాజంలో విశేష గౌరవం, అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తిగా అవాస్తవమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పలు సెక్షన్ల కింద కేసు..
ఈ మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు అభిమానుల్లో ఆందోళన కలిగించడమే కాకుండా, సమాజంలో అనవసర గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో వివరించారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసం ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు, ఆరోగ్యంపై నిరాధార కథనాలు సృష్టించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలైన వీడియో లింకులు, స్క్రీన్‌షాట్లను కూడా న్యాయవాది పోలీసులకు అందజేశారు. అనంతరం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, న్యాయపరమైన విధానాల ప్రకారం కోర్టు అనుమతి పొందారు. కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కఠిన చర్యలు తప్పవు..
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం వంటి అంశాలపై నిరాధార ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది.
మరోవైపు దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర కూడా నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యలోకం నేపథ్యంగా 14 లోకాల చుట్టూ సాగే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
