Pokiri | టాలీవుడ్ చరిత్రలో మాస్ సినిమాలకు కొత్త దిశను చూపించిన ‘పోకిరీ’ విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. మహేష్‌బాబు స్టైల్, పూరీ జగన్నాథ్ టేకింగ్, ఇలియానా అందం, మణిశర్మ సంగీతం అన్ని కలిసొచ్చి ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి.
2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. పాన్ ఇండియా ట్రెండ్ లేకుండానే ఒక తెలుగు సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించగలదో ‘పోకిరీ’ నిరూపించింది. మహేష్‌బాబులో మాస్ కోణాన్ని బయటపెట్టిన ఈ సినిమా ఆయన కెరీర్‌ను పూర్తిగా మలిచింది.
అసలు ప్లాన్ వేరేలా!
ఈ సినిమాకు మొదట “ఉత్తమ్ సింగ్ – సన్నాఫ్ సూర్యనారాయణ” అనే టైటిల్ అనుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు కథ వినిపించినా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. తరువాత రవితేజతో చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు. ఒక దశలో సోనూసూద్‌తో కూడా చేయాలనుకున్నారు. చివరకు కథ మహేష్‌బాబు వద్దకు చేరి సినిమా రూపుదిద్దుకుంది. హీరోయిన్‌గా మొదట కంగనా రనౌత్‌ను అనుకున్నప్పటికీ, చివరకు ఇలియానా ఎంపికయ్యారు.
మహేష్ వచ్చాక మారిపోయిన ఆట
మహేష్ ఎంట్రీతో సినిమా పూర్తిగా మారిపోయింది. సాఫ్ట్ ఇమేజ్‌తో ఉన్న మహేష్‌ను పూరీ జగన్నాథ్ మాస్ అవతార్‌లో చూపించారు. లాంగ్ హెయిర్, రఫ్ లుక్, ప్రత్యేక మేనరిజం—ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఎప్పుడొచ్చామన్నది కాదు… బుల్లెట్ దిగిందా లేదా?” వంటి డైలాగులు ఇప్పటికీ ట్రెండ్‌లో ఉన్నాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని కలిసిన పూర్తి వినోదాత్మక చిత్రం ఇది.
మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. ‘డోలే డోలే’, ‘గలగల పారుతున్న’ వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
రికార్డుల వర్షం
‘పోకిరీ’ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిసింది. 200కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. అప్పట్లోనే 66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 63 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం.
తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ అయి అక్కడా విజయం సాధించింది. హిందీలో ‘వాంటెడ్’ పేరుతో సల్మాన్ ఖాన్ నటించగా అక్కడ కూడా భారీ హిట్‌గా నిలిచింది.
ఇండస్ట్రీకి దారి చూపిన సినిమా
ఇప్పుడు వందల కోట్ల వసూళ్లు సాధారణమైపోయినా, తక్కువ టికెట్ ధరల కాలంలో ‘పోకిరీ’ సాధించిన విజయానికి ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్ కమర్షియల్ శక్తిని ప్రపంచానికి చూపించిన సినిమా ఇదే.
ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం కూడా గుర్తుండిపోయింది. నీళ్లలో తీసిన ఒక సన్నివేశంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని క్షణాల ముందు మహేష్‌బాబు కూడా అదే నీటిలో తలపెట్టడం జరిగింది. ఆ నాడు మహేష్‌కి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. మొత్తంగా, ‘పోకిరీ’ ఒక సినిమా కాదు… టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంచలనం.
