Prince Yawar | బిగ్‌బాస్ షోతో గుర్తింపు పొందిన నటుడు ప్రిన్స్ యావర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకోవడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలికి చెందిన బిల్డర్ నవాజ్ తనను మోసం చేశాడని, డబ్బులు తిరిగి అడిగితే తనపై హనీ ట్రాప్ ప్లాన్ చేసి ఇరికించాడని యావర్ సంచలన ఆరోపణలు చేశారు.
యావర్ తెలిపిన వివరాల ప్రకారం, బిల్డర్ నవాజ్ మొదట తన కుమార్తెతో నిశ్చితార్థం చేస్తానని చెప్పి తనకు దగ్గరయ్యాడు. ఆ నమ్మకంతోనే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో యావర్ నుంచి సుమారు రూ.23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం కొంతకాలానికి ఆ మొత్తాన్ని రూ.40 లక్షలుగా తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినట్లు యావర్ తెలిపారు.
బెదిరింపులు..
అయితే, గడువు ముగిసినప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, యావర్ ఒత్తిడి చేయడంతో నవాజ్ బెదిరింపులకు దిగాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో యావర్ చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తనకు ఇవ్వాల్సిన డబ్బుల నుంచి తప్పించుకోవడానికి నవాజ్ తన కుమార్తెను ఉపయోగించి ‘హనీ ట్రాప్’ పన్నాగం పన్నాడని యావర్ ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని, అది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైందని పేర్కొన్నారు.
పక్కా ప్రణాళికలతో కుట్ర..
తన ప్రతిష్టను దెబ్బతీయడానికి పక్కా ప్రణాళికతో ఈ కుట్ర జరిగిందని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఈ సంఘటన ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా, పోలీసులు రెండు కోణాల్లో కేసును విచారిస్తున్నట్లు సమాచారం. నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
