Honey Trap | థాయ్‌లాండ్ బౌద్ధ సన్యాసులపై వలపు వల – వంద కోట్ల బ్లాక్‌మెయిల్
థాయ్‌లాండ్‌లో ఒక మహిళ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకొని వాటి వీడియోలను ఉపయోగించి కోట్ల రూపాయలు వసూలు చేసిన వివాదం బౌద్ధ సమాజాన్ని కుదిపేస్తోంది. 80,000 వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఈ కేసు సన్యాసులపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసింది. బౌద్ధ సంస్థలోని లోపాలు, విలాస జీవనం, ఆర్థిక దోపిడీలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.

Adharva / International News / 19 July 2025
థాయ్‌లాండ్‌లో బౌద్ధ సన్యాసులను కుదిపేస్తున్న అతి పెద్ద వివాదం బయటపడింది. పోలీసుల ఆధీనంలోకి వచ్చిన Ms. Golf గా వ్యవహరించే విలావాన్ ఎంసావట్ అనే మహిళ అనేక మంది సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని, ఆ క్షణాలను రహస్యంగా చిత్రీకరించి వారిని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత మూడు సంవత్సరాల్లో ఆమె దాదాపు 385 మిలియన్ బాత్ (సుమారు ₹100 కోట్లు) దోచుకున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ఆమె ఇంటిని శోధించగా 80,000 కంటే ఎక్కువ నగ్న ఫోటోలు, శృంగార వీడియోలు స్వాధీనం అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా సన్యాసులపై బ్లాక్‌మెయిల్ చేస్తూ విలాసవంతమైన జీవనం గడిపినట్లు వెల్లడైంది.
2024 మేలో బ్యాంకాక్‌లోని ఒక బౌద్ధ మఠాధిపతి ఎంసావట్తో తో సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె అతనిని తన బిడ్డకు తండ్రి అని ఆరోపించి 7 మిలియన్ బాత్ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో ఆ మఠాధిపతి సన్యాస వృత్తిని విడిచిపెట్టాడు. దర్యాప్తు కొనసాగించగా మరికొంతమంది సన్యాసులు కూడా ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపినట్లు బయటపడింది. ఈ లావాదేవీలలో ఎక్కువ భాగం ఆన్‌లైన్ జూదానికి వెళ్ళినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎవరీ విలావాన్ ఎంసావట్(Ms. Golf)?
థాయ్‌లాండ్‌కు చెందిన 30 ఏళ్ల విలావాన్ ఎంసావట్ (Wilawan Emsawat), దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బౌద్ధ సన్యాసుల లైంగిక బ్లాక్‌మెయిల్ స్కాండల్‌కు కేంద్రబిందువుగా నిలిచింది. ఆమెను పోలీసులు “Ms. Golf” అనే పేరుతో పిలుస్తున్నారు. నొంథబురిలోని ఒక విలాసవంతమైన ఇంటిలో నివసిస్తూ, లగ్జరీ కార్లు, ఖరీదైన బహుమతులు, కోట్లు విలువైన బ్యాంకు లావాదేవీలతో విలావాన్ జీవితం అతి విలాసవంతంగా సాగింది. థాయ్ బౌద్ధ సంస్థల్లో ఇటువంటి వివాదాలు కొత్తవి కావు. గతంలో కూడా సన్యాసులు లైంగిక దోపిడీ, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆర్థిక అవినీతి ఆరోపణలకు గురయ్యారు. 2017లో విరాపోల్ సుక్‌ఫోల్ అనే సన్యాసి విలాసవంతమైన జీవనశైలితో, మోసం, లైంగిక నేరాలు, మనీలాండరింగ్ కేసులతో అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాడు. 2022లో పేత్చబున్ ప్రావిన్స్‌లో ఒక ఆలయం డ్రగ్ రైడ్‌లో బహిర్గతమై మొత్తం సన్యాసులు అరెస్టవ్వడం, ఆలయం ఖాళీ కావడం కూడా సంచలనం రేపింది.
ఈసారి మిస్.గోల్ఫ్ కేసు అంతకుమించి బౌద్ధ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసింది. సాంగా సుప్రీం కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కొత్త నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది. థాయ్ రాజు వజిరలోంగ్‌కోర్న్, ఇటీవలే ప్రధాన సన్యాసులకు ఇచ్చిన బిరుదులను రద్దు చేశారు. ఈ ఘటనల వల్ల బౌద్ధ వ్యవస్థలో పారదర్శకత, క్రమశిక్షణపై కొత్త చర్చలు మొదలయ్యాయి.ప్రస్తుతం థాయ్ ప్రభుత్వం కూడా ఆలయ ఆర్థిక లావాదేవీలపై కఠిన నిబంధనలను అమలు చేయాలని పరిశీలిస్తోంది. ఆలయాలు పొందే విరాళాలు, నిధుల వినియోగంపై పూర్తి వివరాలను బయటపెట్టే విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోనుంది. నేషనల్ ఆఫీస్ ఆఫ్ బుద్ధిజం “సన్యాసుల స్థానం ఎంత ఉన్నతమైనదైనా తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని ప్రకటించింది.
మిస్.గోల్ఫ్, విలావాన్ ఎంసావట్ తన ఇంటర్వ్యూలో ఇద్దరు సన్యాసులు, ఒక మఠాధిపతితో సంబంధం పెట్టుకున్నానని అంగీకరించింది. ఆమెకు లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల బహుమతులు లభించాయని వెల్లడించింది. “ప్రేమలో పడి ఈ సంబంధాలను కొనసాగించాను, కానీ అది తప్పు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను,” అని ఆమె కన్నీళ్లతో మీడియాకు చెప్పింది. బౌద్ధ సన్యాసులు తమ పవిత్ర ప్రతిజ్ఞలకు విరుద్ధంగా లైంగిక ఆశలకు లొంగిపోవడం థాయ్ సమాజాన్ని కుదిపేస్తోంది. మునుపటి సన్యాసి మరియు ఇప్పుడు ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ పాయవాన్ వన్నాబుడ్ మాట్లాడుతూ, “డబ్బు, శక్తి, ప్రాధాన్యం సన్యాసులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. మిస్.గోల్ఫ్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బయటపడని బాగోతాలు బయటకు రావాలి,” అని అన్నారు. బౌద్ధ పండితులు ఈ వివాదాన్ని బౌద్ధ సంస్థలోని క్రమశిక్షణ లోపాలకు ఉదాహరణగా చూస్తున్నారు. “సీనియర్ సన్యాసులు అధికారం కలిగి ఉండటంతో ఎవరు తప్పులు చేసినా మాట్లాడలేరు. ఇది ఒక భూస్వామ్య వ్యవస్థలా మారింది,” అని మతపరమైన పండితుడు సురాఫోట్ థవీసాక్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదం తర్వాత ప్రజలు బౌద్ధ సన్యాసులపై నమ్మకం కోల్పోతారేమో అన్న భయం వ్యక్తమవుతోంది. అయితే మతంపై విశ్వాసం కొనసాగుతుందని, కానీ ఆ విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి సంస్కరణలు తప్పనిసరిగా తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. థమ్మసాట్ యూనివర్శిటీకి చెందిన సమాజ శాస్త్రవేత్త ప్రకిరతి సటాసుట్ మాట్లాడుతూ, నిజం వెలుగులోకి రావాలి. సాంగ్గా సుప్రీం కౌన్సిల్ దృఢమైన చర్యలు తీసుకుంటేనే ఈ సంస్థ ప్రతిష్ఠ కాపాడబడుతుంది అని అన్నారు.