Vijay-Trisha | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. తల్లి మరణ వార్తతో అజిత్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆ సమయంలో విదేశాల్లో ఉన్న అజిత్ కుమార్ ఈ విషాద వార్త అందుకున్న వెంటనే హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తల్లి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. మోహిని మణికి అజిత్‌తో పాటు అనూప్ కుమార్, అనిల్ కుమార్ అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ఆమె ఎంతో అండగా నిలిచిన వ్యక్తిగా సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు.
విజయ్ తీవ్ర సంతాపం..
అజిత్ తల్లి మరణంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, “నా స్నేహితుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మాయియార్ మరణ వార్త నన్ను కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
అయితే విజయ్ కేవలం సంతాప సందేశం పంపడానికే పరిమితం కాలేదు. స్వయంగా అజిత్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి త్రిష కృష్ణన్ కూడా విజయ్‌తో కలిసి అజిత్ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి మోహిని మణి పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
త్రిషతో కలిసి…
అనంతరం మాతృవియోగంతో బాధలో ఉన్న అజిత్‌ను విజయ్, త్రిష ఆత్మీయంగా పలకరించి ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో వారి పరామర్శ అజిత్ కుటుంబానికి కొంత ఊరటనిచ్చినట్లు అక్కడి వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో కలిసి త్రిష బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అజిత్ ఇంటి వద్దకు వచ్చిన విజయ్, త్రిషలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకవైపు అజిత్ తల్లి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతుండగా, మరోవైపు విజయ్-త్రిష కలిసి అజిత్‌ను పరామర్శించిన దృశ్యాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. క్లిష్ట సమయంలో స్నేహితుడికి అండగా నిలిచిన విజయ్ వ్యవహారాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
#Ajithkumar receiving #ThalapathyVijay along with Trisha..🤝 pic.twitter.com/DH4nJB8x2F
— Laxmi Kanth (@iammoviebuff007) May 30, 2026
