Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘పెద్ది కి ఆవాజ్’ మ్యూజికల్ ఈవెంట్‌లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్ లెవెల్‌లో ప్రారంభించిన చిత్రబృందం, మొదటి ఈవెంట్‌ను భోపాల్‌లో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన లైవ్ ప్రదర్శనతో అభిమానులను ఉత్సాహపరిచారు. అదే వేదికపై చిత్రంలోని మూడో సింగిల్ ‘హల్లల్ల ల్లో’ పాటను అట్టహాసంగా విడుదల చేశారు. పాట విడుదలైన వెంటనే అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.
ఎంతో ప్రత్యేకం..
ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్, భోపాల్ ప్రజలపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ప్రమోషన్లను ఇక్కడి నుంచే ప్రారంభించడం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని తెలిపారు.
“మేమంతా ఎంతో కష్టపడి, మనసుపెట్టి ఈ సినిమా చేశాం. ఇది కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కాదు. తన ఉనికి కోసం ఒక వ్యక్తి చేసే పోరాటం ఇందులో ఉంటుంది. ఆ ఎమోషన్ ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది” అని చరణ్ అన్నారు.
చిత్రంపై ధీమా..
అంతేకాకుండా ‘పెద్ది’ తన కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని, తన వ్యక్తిగత ఫిల్మ్ లైబ్రరీలో ఈ చిత్రం నంబర్ వన్ స్థానంలో ఉంటుందని తెలిపారు.
ఈ సినిమా ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాత వెంకట సతీష్ కిలారు, దర్శకుడు బుచ్చిబాబు సానాతో పాటు సహనటులు జాన్వీ కపూర్, రవికిషన్, దివ్యేందులకు రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’కు ఇచ్చిన ప్రేమను ‘పెద్ది’కి కూడా అందించాలని అభిమానులను కోరారు. సినిమా విజయోత్సవ వేడుకతో మళ్లీ భోపాల్‌కు వస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. తన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్‌తో పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆయన అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, రెండు పాటలు ప్రేక్షకుల్లో భారీ బజ్‌ను సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్స్‌ను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం.
