Spy Movie Review | అఖిల్ చేసిన తప్పే.. నిఖిల్ కూడా చేశాడు

Spy Movie Review మూవీ పేరు: ‘స్పై’ విడుదల తేదీ: 29 జూన్, 2023 నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మీనన్, సాన్యా, ఆర్యన్ రాజేష్, రానా దగ్గుబాటి (అతిథి), మకరంద్ దేవ్                        పాండే, జీసు సేన్ గుప్తా, అభినవ్ గోమటం తదితరులు సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ కథ, నిర్మాత: కె. రాజశేఖర్ […]

Spy Movie Review | అఖిల్ చేసిన తప్పే.. నిఖిల్ కూడా చేశాడు

Spy Movie Review

మూవీ పేరు: ‘స్పై’
విడుదల తేదీ: 29 జూన్, 2023
నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మీనన్, సాన్యా, ఆర్యన్ రాజేష్, రానా దగ్గుబాటి (అతిథి), మకరంద్ దేవ్ పాండే, జీసు సేన్ గుప్తా, అభినవ్ గోమటం తదితరులు
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
కథ, నిర్మాత: కె. రాజశేఖర్ రెడ్డి
ఎడిటింగ్, దర్శకత్వం: గ్యారీ బిహెచ్

Spy Movie Review: కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచీ తన సినిమాల విషయంలో నిఖిల్ తీసుకునే జాగ్రత్తలు, స్టోరీ సెలక్షన్ వంటివి అతన్ని వైవిధ్యభరితమైన హీరోగా మార్చేశాయి. అందుకే ‘హ్యాపీడేస్’ సినిమాతో ఓ ఇద్దరు ముగ్గురు హీరోలు పరిచయం అయినా.. నిఖిల్ మినహా మరెవ్వరూ లైమ్‌లైట్‌లో లేరంటే.. అతను వెళ్లే దారే అందుకు కారణం.

‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’, ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాలు నిఖిల్‌ హీరో స్థాయిని పెంచాయి. ఆఫ్‌కోర్స్ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఉన్నప్పటికీ.. ‘కార్తికేయ 2’ సినిమా అతనికి తిరుగులేని స్టార్‌డమ్ ఇచ్చింది. దీంతో అతను టైర్ 2 జాబితాలోకి చేరిపోయాడు. ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. మరి అలాంటి హీరో నుంచి సినిమా వస్తుందీ అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఏదో ఒక కొత్త పాయింట్ ఇందులో ఉండే ఉంటుందని ఊహిస్తారు.

ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్ కూడా ఈ సినిమాలో ఏదో కొత్తగా చెబుతున్నారనే అభిప్రాయానికి తీసుకువచ్చాయి. మరీ ముఖ్యంగా సుభాస్ చంద్రబోస్ మరణం విషయంలో ఇప్పటికీ రహస్యంగా ఉన్న ఓ పాయింట్‌ని ఇందులో టచ్ చేసినట్లుగా మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ రహస్యం ఏమిటి? ఇందులో ఉన్న కొత్తదనం ఏమిటి? అది ప్రేక్షకులకు నచ్చిందా? అసలీ సినిమా ఎలా ఉందనేది మన రివ్యూలో తెలుసుకుందాం..

కథ:

‘రా’ ఏజెంట్స్ అయిన జైవర్ధన్ తన మిత్రుడు కమల్ (అభినవ్ గోమఠం)తో కలిసి శ్రీలంకలో ఒక మిషన్‌లో వుంటారు. అదే సమయంలో చనిపోయాడనుకున్న టెర్రరిస్ట్ ఖదీర్ ఖాన్ బ్రతికే ఉన్నాడని, దేశంలో జరుగుతున్న దాడులకు అతనే కారణం అని ‘రా’ చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశపాండే)కి తెలుస్తుంది.

వెంటనే జై అండ్ టీమ్‌ని లైన్‌లోకి దించుతాడు. జై టీమ్‌లో కమల్‌తో పాటు సరస్వతి (సాన్యా ఠాకూర్), వైష్ణవి (ఐశ్వర్య మీనన్) ఉంటారు. వీళ్ళందరూ ఖదీర్ ఖాన్ పట్టుకోవడం కోసం వెళతారు. ఖదీర్ ఖాన్ మరణంతో పాటే తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేష్) మరణం కూడా ముడిపడి ఉండటంతో.. జై ఈ రహస్యాన్ని ఎలా చేధించాడు?

నిజంగా ఖదీర్ ఖాన్ బ్రతికే ఉన్నాడా? బతికి ఉంటే జై అండ్ టీమ్ ఎలా పట్టుకున్నారు? ఈ కథకి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి అయిన నేతాజీ అదృశ్యానికి ఉన్న లింకేంటి? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ ‘స్పై’ సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాపై మొదటి నుంచి నిఖిల్ అంత ఇంట్రస్ట్‌‌గా లేడనేలా వార్తలు వచ్చాయి. మధ్యలో హీరో, దర్శక, నిర్మాతలకు మధ్య గొడవలు కూడా జరిగాయనేలా టాక్ నడిచింది. ఆ ఎఫెక్ట్ ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా నిఖిల్ ఈ సినిమాలో కొత్తగా ఏం కనిపించలేదు. ఎప్పటిలానే.. తన తరహాలో చేసుకుంటూ పోయాడు తప్ప.. తన బలమైన వైవిధ్యతను మాత్రం చాటలేకపోయాడు. లుక్ పరంగా కూడా కొత్తగా ఏం చూపించలేదు.

కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లలో మాత్రం నిఖిల్ బాగా కష్టపడ్డాడని అనిపిస్తుంది. అంతే తప్ప.. అతనికి ఈ సినిమా ఏ విధంగానూ ప్లస్ కాదనే చెప్పుకోవాలి. హీరోయిన్స్ ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్.. వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ.. మధ్య మధ్యలో గ్లామర్‌ని యాడ్ చేశారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. అభినవ్ గోమటం తన పాత్రకు న్యాయం చేశాడు.

మధ్యమధ్యలో తింగరతింగరిగా మాట్లాడుతూ.. నవ్వించే ప్రయత్నం చేశాడు. రా ఛీప్‌గా చేసిన మకరంద్ దేశ్ పాండే మరీ కృత్రిమంగా కనిపించాడు. ఇంకా ఆర్యన్ రాజేష్, పోసాని, తనికెళ్ల భరణి వంటి వారంతా ఏదో తమకిచ్చిన పాత్రలు చేశామంటే చేశాం అన్నట్లుగా వెళ్లిపోయారు. వారి పాత్రలు సినిమాపై ఏమంత ప్రభావం చూపేవిగా అయితే లేవు. విలన్లుగా చేసిన నితిన్ మెహతా, జిషు సేన్ పాత్రలకు మంచి హై ఇచ్చే ఛాన్స్ ఉండి కూడా దర్శకుడు వినియోగించుకోలేదనిపిస్తుంది. రానా అతిథి పాత్ర కాస్త ఊరట నిస్తుంది. మిగతా అంతా ఓకే అంటే ఓకే.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌‌గా ఉన్నాయి. ‘రా’ బ్యాక్‌డ్రాప్ మూడ్‌ని కెమెరా చక్కగా బంధించింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆ మూడ్‌ని క్యారీ చేసింది. ఈ చిత్రానికి కథ అందించింది నిర్మాతే. ఇంకా వైవిధ్యంగా చెప్పే ఛాన్స్ ఉన్నా.. నేతాజీ ఘటనకు ముడిపెట్టాలనేది ధ్యేయంగా కనిపించింది.

అక్కడక్కడా వచ్చే కొన్ని డైలాగ్స్, నేతాజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నప్పటికీ మిగతా కథ మాత్రం గాడి తప్పింది. ముఖ్యంగా స్ర్కీన్‌ప్లే ఏమంత ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు పరవాలేదనిపిస్తాయి. చిత్రానికి దర్శకత్వ లోపం అడుగడుగునా కనిపించినా.. దర్శకుడే ఎడిటర్ కావడంతో.. ఎడిటింగ్ పరంగా మాత్రం వంక పెట్టలేము. వాస్తవానికి దర్శకుడు గ్యారీ బిహెచ్‌ది ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్. అందుకేనేమో.. దానిపై పట్టు కనిపించింది తప్పితే.. దర్శకుడిగా మాత్రం ఆయన సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి.

విశ్లేషణ:

ఇటీవల అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ అంటూ ఎలా అయితే హడావుడి చేశాడో.. దాదాపు నిఖిల్ కూడా అలాంటి హడావుడే తప్ప.. సినిమాలో ఉండాల్సిన కంటెంట్‌పై మాత్రం దృష్టి పెట్టలేదనిపిస్తుంది. ముఖ్యంగా ‘రా’ సినిమాలకు ఉండాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఈ సినిమాలో లోపించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అని కాకపోయినా.. నిఖిల్ సినిమా అని థియేటర్లకి వెళ్లిన వారు మాత్రం భారీగా డిజప్పాయింట్ అవుతారు.

అయితే నేతాజీ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ వరకు సీట్లో కూర్చున్న ప్రేక్షకుడికి కాస్త కిక్కిచ్చే అంశాలు. అంతకు మించి గొప్పగా చెప్పుకోవడానికి ఇందులో ఏం లేదు. పైగా ఇలాంటి సినిమాలు ఆల్రెడీ చాలా వచ్చాయిగా.. మళ్లీ ఇదేంటి? అని కూడా అనిపిస్తుంది. దేశంపై టెర్రరిస్ట్‌‌లు దాడి చేయడం, దేశభక్తి నిరూపించుకునేలా హీరో సాహసం చేయడం.. చాలా అంటే చాలా చూసి ఉన్నారు ప్రేక్షకులు.

అలాంటప్పుడు, అదే కథ చెబుతున్నప్పుడు.. స్ర్కీన్‌ప్లే సీట్లో కూర్చోనీయకూడదు. అంత థ్రిల్లింగ్‌గా తీయగలిగితేనే ఇలాంటి అటెంప్ట్ చేయాలి. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో పేరొచ్చింది కదా.. అని ప్రతీది రుద్దితే పోయేది మన పరువే అని నిఖిల్ కూడా గమనించాలి. మొత్తంగా అయితే థ్రిల్లింగ్ అంశాలు లేని ఓ యాక్షన్ సినిమాగా దర్శకుడు ఈ సినిమాని మలిచాడు.

నిఖిల్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడాలనుకుంటే ఓకే గానీ.. ‘రా’ కంటెంట్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఇందులో కొత్తదనం ఏం దొరకదు. ఓ సాదాసీదా సినిమా అంతే..

ట్యాగ్‌లైన్: మరో ‘ఏజెంట్’ అంతే..
రేటింగ్: 2/5