Site icon vidhaatha

Erectile Dysfunction | 60 సెకండ్ల పాటు ఎరుపు కాంతితో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌కు చెక్..!

Erectile Dysfunction | మీరు అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..? ప‌డ‌క‌గ‌దిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా..? అయితే ఇప్పుడు ఆ బాధ అవ‌స‌రం లేదు. కేవ‌లం 60 సెకండ్ల పాటు ఒక ప్ర‌త్యేక‌మైన ఎరుపు కాంతి( Red Light Therapy ) ద్వారా అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌కు చెక్ పెట్టొచ్చు. మీ జీవిత భాగ‌స్వామితో మ‌ధురానుభూతులు పొందొచ్చు. ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ.. జంతువుల‌పై చేసిన ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. మ‌న‌షుల‌పై కూడా త్వ‌ర‌లోనే ఈ ప్ర‌యోగం నిర్వ‌హించ‌నున్నారు.

నార్డ్-1( NORD-1 ) అనే కాంపౌండ్‌ను అంగం చ‌ర్మంలో ప్ర‌వేశ‌పెడుతారు. ఆ త‌ర్వాత ఒక ప్ర‌త్యేక‌మైన టార్చ్‌లైట్ ద్వారా ఆ నార్డ్-1 పైకి కాంతిని ప్ర‌స‌రింజేస్తారు. త‌ద్వారా ఆ కాంతికి నార్డ్-1 స్పందించి నైట్రిక్ ఆక్సైడ్( nitric oxide ) విడుద‌ల అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అంగానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగై పురుషాంగం ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది. ఇక అంగస్తంభ‌న స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. ఈ త‌రహా చికిత్స జంతువుల్లో స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు.

తొలిసారిగా ఎలుక‌ల‌పై ప్రయోగం..

జ‌పాన్‌లోని న‌గోయా సిటీ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు తొలిసారిగా ఈ ప్రయోగాన్ని ఎలుక‌ల‌( Rats )పై నిర్వ‌హించారు. అంగ స్తంభ‌న స‌మ‌స్య ప‌రిష్కారం కనుగొనేందుకు ఎలుక‌లకు నైట్రిక్ ఆక్సైడ్‌ను ఇంజెక్టు చేశారు. దీంతో పాటు ప్ర‌త్యేక రెడ్ లైట్‌( Red Light )ను కూడా ప్ర‌స‌రింప‌జేశారు. అయితే నేరుగా నైట్రిక్ ఆక్సైడ్ ప్ర‌యోగం చేయ‌డం వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్న‌ట్లు తేలింది. లో బీపీ వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయి. రెడ్ లైట్ ప్ర‌యోగ‌మే ఉత్త‌మ‌మ‌ని ఆ ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. నార్డ్ -1ను ఉంచి ప్ర‌త్యేక ఎరుపు కాంతిని ప్ర‌స‌రింప‌జేయ‌డంతో నాలుగు వారాల్లో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించిన‌ట్లు పేర్కొన్నారు.

జంతువుల్లో ఓకే.. మ‌రి మనుషుల్లో..

జ‌ప‌నీస్ శాస్త్ర‌వేత్త‌ల ప్ర‌కారం.. ఈ చికిత్స జంతువుల‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసింది. ఇదే ప్రయోగం మాన‌వుల్లో కూడా చేస్తే త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తామ‌నే విశ్వాసం ఉంద‌న్నారు. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య ఉన్న‌వారు చాలా మెడిసిన్స్ వినియోగిస్తున్నారు. కానీ వాటి వ‌ల్ల ఉప‌యోగం లేదన్నారు. త్వ‌ర‌లోనే మ‌నుషుల‌పై కూడా రెడ్ లైట్ చికిత్స‌ను ప్ర‌యోగిస్తామ‌న్నారు. ఒక వేళ ఈ చికిత్స విజ‌య‌వంత‌మైతే.. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య ఉన్న‌వారికి ఇది ఒక ఆయుధంగా మారుతుంద‌న్నారు.

మ‌రి వ‌యాగ్రా..?

ప‌ది మందిలో ఒక‌రు అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. షుగ‌ర్, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, ఒత్తిడి కార‌ణంగా ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఇలాంటి వారికి వ‌యాగ్రా ఉప‌యోగ‌ప‌డుతుంది. వ‌యాగ్రా( Viagra ) వేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తనాళాలు విస్త‌రించి పురుషాంగానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. కానీ వ‌యాగ్రా వాడ‌టం అంత మంచిది కాదు. సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి రెడ్ లైట్ థెర‌పీ ఉత్త‌మం అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రోగుల‌కు కొత్త ఆశ‌..

ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌( Prostate Cancer )తో బారిన ప‌డిన వారికి రెడ్ లైట్ థెర‌పీ ద్వారా కొత్త లైంగిక జీవితాన్ని ఇవ్వొచ్చు అని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. వారిపై ఈ చికిత్స ప్ర‌భావంతంగా ప‌ని చేస్తుంద‌న్నారు. సంతానోత్ప‌త్తి పెంచ‌డంలోనూ ఈ థెర‌పీ ఉప‌యోగ‌పడుతుంద‌న్నారు.

Exit mobile version