అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్ల జారీ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించగా, అనంతరం కేసు ట్రయల్ ప్రారంభం కానుంది.

ఐకాన్ స్టార్.. సినీనటుడు అల్లు అర్జున్‌కు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని పేర్కొంది. ఈ ఘటనలో చిక్కడి పల్లి పోలీసులు అల్లు అర్జున్‌ ఏ11గా.. సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. నిందితుల వ్యక్తి గత హాజరు తరువాత ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించనుంది.

2024 డిసెంబర్‌ 4న పుష్ప-2 రిలీజ్‌ ముందు రోజు బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చర్లపల్లికి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మొదట నాలుగు వారాల మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

ఘటన తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌ అండగా నిలిచారు. శ్రీ తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీతేజ కోలుకుంటున్నారు.

Latest News