HYDRA | రాజేంద్రనగర్ లో రూ. 139 కోట్ల భూమికి హైడ్రా విముక్తి

రాజేంద్రనగర్ బద్వేల్-ఉప్పరపల్లిలో జన చైతన్య లేఔట్‌లోని ₹139 కోట్లు విలువైన 19,878 గజాల ఆక్రమిత పార్కు స్థలాలకు హైడ్రా విముక్తి కల్పించింది. ఆక్రమించి నిర్మించిన షెడ్లు, గదులను తొలగించింది.

Rajendranagar land encroachment

విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది. బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జన చైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I &II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జన చైతన్య లేఔట్ లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది.

బుధవారం ఆక్రమణలపై రంగంలోకి దిగిన హైడ్రా కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.

Latest News