హైదరాబాద్ సౌత్ జోన్ లో కొత్తగా 6 వరుసల ఫ్లైఓవర్​!

హైదరాబాద్ సౌత్ జోన్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ రూ.345 కోట్లతో మెయిలార్‌దేవ్‌పల్లి-శంషాబాద్-కాటేదాన్​ మధ్య రెండు వైపులా ప్రయాణించగలిగే ఆరు లేన్ల ఫ్లైఓవర్​ నిర్మించనుంది.

హైదరాబాద్ నగరం సౌత్ జోన్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కారిడార్ నిర్మాణానికి సిద్దమైంది. ఏకంగా రూ. 345 కోట్లతో కొత్త కారిడార్ నిర్మించబోతుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే రూట్లలో బిజీ ట్రాఫిక్ తో ఉండే మెయిలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్​ జంక్షన్లను కలిపి ఒక ‘సిక్స్-లేన్ బై-డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్’ (ఆరు వరుసల ఫ్లైఓవర్ తరహా కారిడార్) నిర్మించబోతున్నారు. మూడు జంక్షన్లను కలిపే ఈ కారిడార్ పూర్తయితే, ఎక్కడా సిగ్నల్స్ లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా వాహనాలు ముందుకెళ్లిపోవచ్చు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రోగ్రామ్ కింద ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కాటేదాన్ జంక్షన్ దగ్గర 11.5 మీటర్ల వెడల్పుతో త్రీ-లేన్ వన్-వే డౌన్ రాంప్ (ఫ్లైఓవర్ దిగే దారి) కూడా నిర్మిస్తారు. దీనివల్ల లోకల్ గా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు కూడా పరిష్కారం దొరకనుంది. ఇటు ఇండస్ట్రియల్ ఏరియా, అటు రెసిడెన్షియల్ ఏరియా కావడంతో ఈ మూడు జంక్షన్ల మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఇక్కడ నిలిచిపోతుంటాయి. మూడు జంక్షన్లను కలిపి కొత్తగా నిర్మించనున్న ‘సిక్స్-లేన్ బై-డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్’ (ఆరు వరుసల ఫ్లైఓవర్ తరహా కారిడార్) నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా దూరం కానున్నాయి.

రెండేళ్లలో పనుల పూర్తి లక్ష్యం

‘సిక్స్-లేన్ బై-డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్’ (ఆరు వరుసల ఫ్లైఓవర్ తరహా కారిడార్) నిర్మాణం పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనకు ‘ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్’ (PMC)ని నియమించేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచింది. డిజైన్లను పరిశీలించడం, నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడం, సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడటం ఈ కన్సల్టెంట్ బాధ్యత. ఈ కొత్త సిక్స్ లైన్ కారిడార్ నిర్మాణాన్ని కేవలం 24 నెలల (రెండు సంవత్సరాల) కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త టెక్నాలజీ, ఆధునిక నిర్మాణ పద్ధతులను ఉపయోగించి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు సమయం బాగా ఆదా అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, నిత్యం ఆ రూట్లో ప్రయాణించే లోకల్స్ ప్రయాణం ఎంతో సులువుగా మారుతుంది. హైదరాబాద్ సిటీ నలుమూలలా మారుతున్న మౌలిక వసతుల్లో ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం కాబోతోంది.

కొత్తగా మరిన్ని లింక్ రోడ్లు.. ఫ్లై ఓవర్లు.. అండర్ పాస్ లు

కొత్త సిక్స్ లైన్ కారిడార్ నిర్మాణంతో పాటు హైదరాబాద్ సిటీలోని ఇతర కీలక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ మరికొన్ని లింక్ రోడ్లను, ఫ్లైఓవర్లను, అండర్ పాస్ లను ప్లాన్ చేస్తోంది. ఐటీ కారిడార్‌తో పాటు పాతబస్తీ, కత్తెదాన్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలను అనుసంధానిస్తూ మరిన్ని కొత్త రూట్లను అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంతో పాటు రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఈ ప్రాంతాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కేబీఆర్ పరిసరాల్లో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్ లను కూడా అందుబాటులోకి తీసుకరావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Latest News