తెలంగాణ గొంతులపై ఆంధ్రా ఇనుప బూట్లా?.. భగ్గుమన్న తెలంగాణ వాదులు!

తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతోందంటూ హైదరాబాద్‌లో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేశ్వర్ రావు కేసుపై మండిపడ్డారు.

తెలంగాణలో మరోసారి హైదరాబాద్ వేదికగా ఆంధ్ర ప్రాంత ఆధిపత్య ధోరణిపై వ్యతిరేక సెగలు రాజుకున్నాయి. బుధవారం తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో.. తెలంగాణ గొంతులపై ఆంధ్రా ఇనుప బూట్లు ఇంకెంతకాలం ? పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వక్తలు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు సాగిస్తున్న పలు ఘటనలను ఎత్తిచూపుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నారు. పృధ్వీ, పాశం యాదగిరి, బక్క జడ్సన్, ప్రోఫెసర్ నాగేశ్వర్ రావు, విమలక్క, ప్రభృతులు మాట్లాడారు.

తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏపీలో ఎందుకు పెట్టరు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని వక్తలు ప్రశ్నంచారు. గాయకుడు బాల సుబ్రమణ్యం, ఎన్టీఆర్, రోశయ్య, వైఎస్సార్ వంటి వారు విగ్రహాలు పెడుతున్నారని, అదే సమయంలో తెలంగాణ ప్రజలు గర్వించదగిన దాశరథి, సినారె, కాళోజీ, సర్వాయి పాపన్న, గద్దర్ వంటి మహానుభావుల విగ్రహాలు కూడా విజయవాడ, విశాఖపట్నం, కడప వంటి ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే మరింత ఆనందంగా ఉంటుందన్నారు. మరి ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఎందుకు పెట్టనివ్వడం లేదని నిలదీశారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివనం ద‌గ్గ‌ర‌ పెట్టాల్సిన అవసరం లేదు.. రాబోయే రోజుల్లో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విగ్రహాలు కూడా పెడతారేమో అని,..మీరు ఇలాగే చేసుకుంటూ పోతే అవి దిష్టి బొమ్మల్లా కనిపిస్తాయి అని, ఆయన కంటే ఎక్కువ సినిమాలు నటించిన వాళ్లు ఉన్నారని, మా ప్రాంతానికి చెందిన పైడి జైరాజ్ మంచి హీరో అని, క‌ళాకారుల కోసం భూములు ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి, సినారే లాంటి వాళ్ల విగ్రహాలు కావాలని పాశం యాదగిరి, పృధ్వీ స్పష్టం చేశారు.

నాగేశ్వర్ రావు వ్యాఖ్యలపై ఆంధ్ర పాలకుల అతి..

జనసేన ఫిర్యాదుతో తనపై నమోదైన కేసులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు పట్ల ఆంధ్ర పాలకులు, నాయకులు మరోసారి తెలంగాణ ప్రముఖులపై విషం చిమ్మారని వక్తలు ఆరోపించారు. తాను 30 ఏళ్ల వయస్సులోనే దేనికీ భయపడలేదని, ఇప్పుడు 62 ఏళ్ల వయస్సులో అరెస్ట్‌లకు అస్సలు భయపడబోనని తన అరెస్టు వ్యాఖ్యలపై నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. తనపై కులం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నానని, అల్లర్లు రేపుతున్నానని తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. వాళ్లే కులాలు, ప్రాంతాల గురించి మాట్లాడారు తప్ప.. తననుంచి అలాంటి మాటలు రాలేదని వ్యాఖ్యానించారు.

కుల చిచ్చు పెట్టానని ప్రభుత్వమే నాపై కేసులు పెట్టింది. నా మాటల్లో ‘కులం’ అనే పదమే లేదు.. మరి కులచిచ్చు పెట్టానని కేసులెలా పెడతారు? అని, పవన్ కల్యాణ్ కులం-ప్రాంతం ప్రస్తావన తెచ్చింది మీరు, తిరిగి మమ్మల్ని అంటున్నారు. నేను మాట్లాడాను తప్పా బాంబులు వేయలేదు. నాపై పెట్టిన కేసులను చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. మేము చావనైనా చస్తాము కానీ.. మా మాట్లాడే హక్కును మాత్రం వదులుకోబోమన్నారు.

పాశం యాదగిరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ని ఉపముఖ్యమంత్రి చేయడమే తప్పు అని, ప్రొ. నాగేశ్వర్ రావు ముందు పవన్ కళ్యాణ్ ఓ లిల్లీపుట్ అని, నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా ? అని విమర్శించారు. అసలు అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిని చేయడమే ఒక పెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు చేగువేరా అన్నావని, ఇప్పుడు చంద్రబాబు అంటున్నావు..సిగ్గుందా నీకు? అంటూ పవన్ తీరుపై మండిపడ్డారు.నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీ రామారావు గారి మరణానికి కారకుడైన వ్యక్తి, ఈరోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూర్చోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వర్ రావు చేసిన విమర్శల్లో అంత తప్పు ఏముందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అని ఆయన పాలకులను ప్రశ్నించారు. కేవలం విమర్శలు చేసినందుకే ఒక మేధావిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బక్క జడ్సన్ మాట్లాడుతూ ..ఎంత దమ్ముంటే నాగేశ్వర్ మీద పవన్ కల్యాణ్ కేసు పెడతాడని, ఇంకోసారి తెలంగాణ వాళ్ల మీద ఎఫ్ఐఆర్ చేస్తే మర్యాదగా ఉండదు, ఇదే చివరి ఎఫ్ఐఆర్ కావాలి అన్నారు. నాగేశ్వర్ రావు మీద పెట్టిన కేసులు వాపస్ తీసుకోకపోతే నారా లోకేష్ సహా ఏపీ పాలకులు హైదరాబాద్‌లో ఎలా తిరుగుతాడో చూస్తాం అని హెచ్చరించారు. ఆంధ్రా పోలీసులు తెలంగాణకు ఎలా వస్తారు? అని, తెలంగాణ హోంశాఖ మంత్రి, సీఎం రవేంత్ రెడ్డి ఎలా అనుమతి ఇస్తున్నాడు? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వంలోనూ ఆంధ్ర మీడియాకే మెజార్టీ అక్రిడిటేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో మీడియా అక్రిడేషన్ల కేటాయింపు, వార్తా ఛానళ్ల యాజమాన్యాల తీరుపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టుల హక్కులు, మీడియా నియంత్రణ ఇంకా ఆంధ్ర వారి చేతుల్లోనే ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం వి6 (V6), టి న్యూస్ (T News) ఛానళ్లు మినహాయిస్తే, మిగిలిన ప్రధాన వార్తా ఛానళ్లన్నీ ఆంధ్రా యాజమాన్యాల చేతుల్లోనే నడుస్తున్నాయని యాదగిరి వెల్లడించారు. తెలంగాణలో పనిచేస్తున్న స్థానిక జర్నలిస్టులను పక్కనపెట్టి, ప్రస్తుతం మొత్తం ఆంధ్రా ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకే ఇక్కడ అక్రిడేషన్ కార్డులు ఎక్కువగా ఇస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. స్థానికులకు దక్కాల్సిన గుర్తింపు అన్యాక్రాంతమవుతోందని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి :

పాములను పట్టబోయి..కాటుకు గురైన ఆమెరికా ఆరోగ్య మంత్రి
ఫోటో దిగిపోయారు..కొనుగోలు చేయడం లేదు: రైతుల మొర

Latest News