ఉప్పల్ నల్ల చెరువుకు చెరువుకు సరికొత్త జల కళ !

హైదరాబాద్ ఉప్పల్ నల్లచెరువు తాజా వర్షాలతో జలకళ సంతరించుకుంది. హైడ్రా రూ.20 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులతో చెరువు విస్తీర్ణం పెరిగి, వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా, ఓపెన్ జిమ్‌తో విహార కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.

తాజా వర్షాల వరదలతో హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నల్లచెరువు సరికొత్త జలకళ సంతరించుకుని ఆకట్టుకుంటుంది. వరంగల్-హైదరాబాద్ హైవే వెంట ఉన్న ఉప్పల్ నల్ల చెరువును హైడ్రా రూ.20కోట్లతో అభివృద్ది చేస్తుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరువువర్షపు నీటితో నిండిపోయి, స్థానికులకు ఆహ్లాదకరమైన దృశ్యాన్ని అందిస్తోంది. చెరువులో నీటి మట్టం గణనీయంగా పెరిగి చెరువుకు కొత్త జీవం పోసినట్లయింది.

హైడ్రా తొలి దశలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కీలక చెరువుల్లో నల్లచెరువు ఒకటి. సుమారు 10 ఎకరాల మేర అన్యాక్రాంతమైన చెరువు భూముల నుంచి హైడ్రా ఆక్రమణలు తొలగించింది. దీంతో చెరువు విస్తీర్ణం ఇప్పుడు 70 ఎకరాలకు విస్తరించింది. నాచారం చెరువు నుంచి వరద నీరు ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా ఉప్పల్ నల్లచెరువులోకి చేరేలా హైడ్రా అధికారులు ప్రత్యేకంగా రెండు ఇన్లెట్లను అభివృద్ధి చేశారు. అలాగే, మురుగు నీరు చెరువులో కలవకుండా వేరు చేసేందుకు ఒక బైపాస్ కాలువను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎగువ ప్రాంతాల ప్రజలకు వరద ముంపు సమస్య పూర్తిగా తొలగిపోయింది.

చెరువు నిండిన తర్వాత అదనపు నీరు సురక్షితంగా మూసీ నదికి వెళ్లేలా పటిష్టమైన ఔట్లెట్‌ను కూడా అభివృద్ధి చేశారు. కేవలం నీటి వనరుగానే కాకుండా, స్థానిక ప్రజలకు ఒక అద్భుతమైన విహార కేంద్రంగా చెరువును తీర్చిదిద్దుతున్నారు. చెరువు చుట్టూ అందమైన వాకింగ్ ట్రాక్, మెయిన్ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా,ఓపెన్ జిమ్‌లను నిర్మిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి ఇది మరో అద్భుతమైన ఆహ్లాదకరమైన జలవనరుగా మారనుంది.

Latest News