జస్ట్.. రెండు మూడు గంటలు అంతే.. ఆరువందలకు పైగా ఆమాయకులను పిట్టలను కాల్చినట్లు కాల్చేసారు. అందులో ఎక్కువగా ఉన్నది మహిళలు, పిల్లలు. ఇది జరిగింది మన ప్రపంచంలోనే. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో(Burkina Faso) అనే దేశంలో. బర్సాలోఘో(Barsalogho) అనే పట్టణంలో. ఈ దారుణానికి ఒడిగట్టింది… కర్కోటక తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా(Al-Qaeda) అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్–ఇస్లాం వల్–ముస్లిమీన్(JNIM)కు చెందిన ఉగ్రవాదులు. ఈ ఘటన జరిగింది ఆగస్టు 24,2024న అని ఫ్రాన్స్ అత్యున్నత నిఘా వర్గాలు తెలిపాయి. కేవలం మృతదేహాలను బయటకుతీసి లెక్కించడానికే 3 రోజులు పట్టిందట. బయటి ప్రపంచానికి ఈ ఘోర కృత్యం తెలియడానికి నెల రోజులకు పైగా పట్టిందంటే ఆ దేశం ఎంత వెనుకబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
(ఇదే ఆ దారుణ మారణకాండ జరిగిన బర్సాలోఘో పట్టణం)
జెఎన్ఐఎంకు చెందిన ఉగ్రవాదులు మాలి(Mali) దేశం కేంద్రంగా పనిచేస్తూ, బుర్కినాఫాసోలో చురుగ్గా కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. ఆ రోజు మోటార్‌బైక్‌లపై వచ్చిన తీవ్రవాదులు, కనపడ్డవారిని కనపడ్డట్టుగా కాల్చిపడేసారు. వారంతా అమాయక ప్రజలు. తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో బుర్కనోఫాసో ప్రభుత్వం వారిని లోతైన కందకాలు(Trenches) తవ్వుకుని అందులో దాక్కోవాల్సిందిగా సూచించింది. తీవ్రవాదులు వచ్చేసరికి వారంతా కందకాలు తవ్వేపనిలో ఉన్నారు. వారిని సైనికులుగా భావించిన తీవ్రవాదులు విచ్చలవిడిగా వారిపై కాల్పులు జరిపారు. దాంతో ఎక్కడివారక్కడే రక్తపు మడుగుల్లో కుప్పకూలిపోయారు. వారిలో మహిళలు, పిల్లలే(more Victims are Women and Children) అధికంగా ఉండటం పెను విషాదం. చనిపోయినట్టుగా పడిపోయి ఉన్నవారిని కూడా తూటాలతో బలిగొన్నారు.
(దాడి చేస్తున్న ఉగ్రవాదులు – కందకాల్లో పడిఉన్న మృతదేహాలు)
దాదాపు 2015 నుండి అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్(ISIS) గ్రూపులు మాలి నుండి బుర్కినోఫాసోలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వారిని నియంత్రించడం చేతకాలేదని అప్పటి పాలకుడు పాల్ హెన్రీ సాండయాగో దమీబా(Paul-Henri Sandaogo Damiba)ను తిరుగుబాటు ద్వారా గద్దె దించి 36 ఏళ్ల ఇబ్రహీం త్రావోరె(Ibrahim Traore) అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. కానీ, ఇప్పటికి కూడా ఇస్లామిక్ తీవ్రవాదులు బుర్కినాఫాసోలో విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. వారిని నియంత్రించడం ఆ దేశ సైన్యం వల్ల కావడం లేదు. పైగా ఆ మిలిటెంట్లకు సహకరిస్తున్నారని 200 మందికి పైగా తన ప్రజలనే సైన్యం కాల్చిచంపింది. అక్కడి సైన్యానికి సహకరించేందుకు వచ్చిన అమెరికా, ఫ్రెంచ్ దళాలు(US & French Forces) తీవ్రవాదుల కదలికలను నెమ్మదిగా నియంత్రించగలిగినా, మాలి, బుర్కినాఫాసో, నైజర్లలో జరిగిన తిరుగుబాట్లు విదేశీ దళాల నిష్క్రమణకు దారితీసాయి. దాంతో ఈ ఉగ్రవాదుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది.
తీవ్రవాదుల అనుకూల వర్గాలు సోషల్ మీడియలో పోస్ట్ చేసిన విడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పరిగెడుతున్న చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా చంపేసారంటే వారెంతటి నరరూప రాక్షసులో అర్థం చేసుకోవచ్చు.