చైనాలో సంభవించిన వరదలు సృష్టించిన బీభత్సంతో అక్కడి ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురవుతున్నారు. చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో రోజుల తరబడి కురిసిన భారీ వర్షాలు, జలాశయాలు తెగిపోవడంతో తీవ్రమైన విధ్వంసం జరిగింది. వరదలలో లక్షల మంది బాధితులుగా మిగిలిపోగా…వన్యప్రాణులు, పశువులను కూడా ప్రభావితం చేసింది. గ్వీగాంగ్‌లోని ఒక జంతు ప్రదర్శనశాల మీదుగా వరద పొంగిపొర్లడంతో 100కు పైగా జంతువులు మరణించగా, బిన్యాంగ్ కౌంటీలోని వరద ముంపునకు గురైన పందుల ఫారంలో వేలాది పందులు మృతి చెందాయి. పాముల పెంపకం కేంద్రాలు కూలిపోవడంతో వేలాది పాములు తప్పించుకుని జనావాసాల్లోకి పారిపోయాయి. వరదలకు గురైన ఫారంలో తేలుతున్న పందుల కళేబరాల చిత్రాలు, కొట్టుపోతున్న వందలాది కోబ్రాల వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
100కు పైగా జూ పార్కు జంతువులు మృతి..మరికొన్ని వరదల్లో గల్లంతు
గ్వీగాంగ్ జంతు ప్రదర్శనశాలలో వరద నీరు మూడు మీటర్ల (10 అడుగులు) కంటే ఎక్కువగా పెరిగి, దాదాపు పార్క్ మొత్తాన్ని ముంచేసింది. జూ సిబ్బంది ప్రాణాలతో తప్పించకున్నారు. అయితే జంతుప్రదర్శనశాలలోని చాలా శాకాహార జంతువులు వాటి ఆవరణల నుండి కొట్టుకుపోయి ఆచూకీ లేకుండా పోయాయి. అనేక మాంసాహార జంతువులు నీటిలో మునిగి చనిపోయాయి. మాంసాహార జంతువులు బయటకు వచ్చి ప్రజలను గాయపరుచకుండా వరదలు రాకముందే..వాటి బోనులకు తాళాలు వేయడంతో చాల వరకు జంతువులు బోనులోనే చనిపోయాయి. చనిపోయిన వాటిలో మూడు సింహాలు కూడా ఉన్నాయి. 20కి పైగా జాతులకు చెందిన 100కు పైగా జంతువులు కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న సౌకర్యాలు, తప్పిపోయిన లేదా చనిపోయిన జంతువులతో సహా, ఈ విపత్తు వల్ల 4 మిలియన్ యువాన్లకు పైగా (సుమారు US$560,000) నష్టం వాటిల్లిందని జూ అంచనా వేసింది.
వరదల్లో వేలాది పందులు మృతి
నాన్నింగ్ నగరానికి సమీపంలో ఉన్న బిన్యాంగ్ కౌంటీలోని వాణిజ్య పందుల ఫారాలు కూడా వరదల్లో మునిగిపోయింది. అక్కడ వేలాది పందుల కళేబరాలు నీటిపై బోర్లా తేలుతూ ఉన్నాయి. కొన్ని అప్పటికే కుళ్ళిపోయి నల్లబడటం ప్రారంభించగా, ప్రాణాలతో బయటపడిన ఒక పంది పడవ వైపు ఈదుకుంటూ వచ్చింది.ఆ ప్రదేశాన్ని వాంగ్లింగ్ టౌన్‌షిప్‌లోని ఒక ప్రైవేట్ పశుపోషణ సంస్థ అయిన బిన్యాంగ్ జింగ్‌హువా ప్లాంటింగ్ అండ్ బ్రీడింగ్ కో లిమిటెడ్‌గా గుర్తించారు. పందుల మృతదేహాలను వెలికితీసి, ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచే ప్రయత్నాలకు నిలిచిపోయిన నీరు ఆటంకం కలిగిస్తూనే ఉందని అధికారులు తెలిపారు.
పెంపక కేంద్రం కూలిపోవడంతో జనావాసాల్లోకి వందలాది పాములు
హెంగ్‌జౌ నగరంలోని యున్‌బియావో టౌన్‌షిప్‌లో ఉన్న ఒక పాముల పెంపక కేంద్రాన్ని వరద నీరు ధ్వంసం చేయడంతో, వందలాది పాములు తప్పించుకున్నాయి. ఆ కేంద్రంలోని 900 పాములు సమీప గ్రామాల్లోకి వరద నీటిలో కొట్టుకపోయాయి. ఆ ప్రాంతంలో సాధారణంగా పెంచే జాతులలో నాగుపాములు, కట్ల పాములు, వైపర్స్, చైనీస్ ఎలుక పాములు ఉన్నాయని అధికారులు తెలిపారు. పాముకాటుతో ఇప్పటికే ఓ మహిళ చనిపోగా, మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. నాన్నింగ్‌లోని అధికారులు మాట్లాడుతూ, ఈ వరదల వల్ల ఆ ప్రాంతమంతటా 39 మంది మరణించారని, తొమ్మిది మంది గల్లంతయ్యారని చెప్పారు. లియులాన్ రిజర్వాయర్ గండి పడటం వల్ల 26 మరణాలు సంభవించాయని, వీరిలో ఐదుగురి గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని, మరో ఏడుగురు గల్లంతయ్యారని వారు తెలిపారు. చనిపోయిన జంతువుల కళేబరాలను పాతిపెట్టేందుకుఎక్స్‌కవేటర్లతో కందకాలు తవ్వుతూ, లోతైన ఖననం కోసం సమీపంలోని ఒక స్థలాన్ని కేటాయించారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు వీలుగా భీమా మదింపుదారులు కూడా నష్టాలను అంచనా వేయడం ప్రారంభించారని కౌంటీ ప్రభుత్వం తెలిపింది.
7月7日中国広西チワン族自治区のダムが決壊し、家畜の豚さんが全滅。
中国人民には1人も被害がありませんでした。 by 中国政府 pic.twitter.com/UPwQmIIMzl— のうまにあ願榮光🏴🇯🇵☀️ π (@FreeAll_protest) July 10, 2026
