ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో ఓ మానవ మృగం చేతిలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్‌ (28) అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 11, 2026, 11:43 am IST
Read Time: 5 mins
ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో ఓ మానవ మృగం చేతిలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్‌ (28) అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు.

బాలికను వేధించాడని బాధితురాలు, తల్లి మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. బెయిల్‌పై తిరిగొచ్చిన నిందితుడు.. శనివారం తెల్లవారుజామున ఆరుగురిని నిందితుడు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి..తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా నిందితుడు చెప్పాడు. వెంటనే అతని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.

నిందితుడి చేతిలో బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. బాధిత మైనర్ బాలిక(17)ను నిందితుడు ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

దైవాలగూడలో రాత్రి 11 గంటలకు బాలిక ఇంటికి వెళ్లిన నిందితుడు రాజ్ కుమార్ బాలిక తల్లి, అమ్మమ్మను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆ బాలికను బలవంతంగా కారులో దైవాలగూడ చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేశాడు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ హత్యల పరంపర కొనసాగిందని గుర్తించారు. అనంరం తండ్రికి ఫోన్ చేసిన నిందితుడు హత్యల విషయం చెప్పిన అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

బాలిక తండ్రిని కూడా అతడే చంపాడా..?

ఏడాది క్రితం బాలిక తండ్రిని కూడా రాజ్ కుమార్ హత్య చేసినట్లుగా పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గతంలో బాలిక ను వేధించే క్రమంలో ఆమె తల్లిని బెదిరిస్తూ.. నీ భర్తను చంపినట్లుగానే మిమ్మల్ని అందరిని చంపేస్తానంటూ నిందితుడు బెదిరించాడని, ఈ విషయాన్ని పోలీసు ఫిర్యాదులో కూడా పేర్కొన్నామని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిందితుడు పేర్చిన ఏడు ఇటుకల నేపథ్యంలో బాలిక తండ్రిని కూడా అతడే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.