Suicide | హైద‌రాబాద్ : వారిది విడ‌దీయ‌రాని బంధం. బ‌తుకుదెరువు కోసం భ‌ర్త దుబాయ్ వెళ్ల‌డంతో ఆమె ఒంట‌రైంది. భ‌ర్త క‌ళ్ల ముందు లేక‌పోవ‌డంతో తీవ్ర మానసిక వేద‌న‌కు గురైంది. చివ‌ర‌కు ఒంట‌రిత‌నాన్ని భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. భ‌ర్త కూడా చివ‌ర‌కు భార్య ఉరేసుకున్న గ‌దిలోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప‌రిధిలోని గొల్ల‌ప‌ల్లి గ్రామంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గొల్ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఏఎస్ శ్రీకాంత్(37), స్వప్న‌(34)కు కొన్నేండ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన త‌ర్వాత కొన్నాళ్ల పాటు భార్య‌తో క‌లిసి శ్రీకాంత్ ఇక్క‌డే ఉన్నాడు. ఇక బ‌తుకుదెరువు కోస‌మ‌ని చెప్పి రెండేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అప్ప‌ట్నుంచి స్వ‌ప్న ఒంట‌రిగానే ఉంటుంది. భ‌ర్త దూరంగా ఉండ‌డంతో మరింత మాన‌సిక వేద‌న‌కు గురైంది. ఒంట‌రి జీవితంపై విర‌క్తి చెంద‌డంతో జూన్ 2వ తేదీన ఇంట్లోని త‌న గ‌దిలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది స్వప్న‌.

విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌ హుటాహుటిన స్వస్థలానికి చేరుకుని ఆదివారం కర్మకాండలను పూర్తి చేశాడు. కానీ భార్య జ్ఞాప‌కాలు అత‌నిలో మెదిలాయి. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేక‌పోయాడు. దీంతో భార్య ప్రాణాలు వదిలిన గదిలోనే అతను కూడా ఉరేసుకుని చ‌నిపోయాడు. దీంతో శ్రీకాంత్ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.